మాతృభాషలోనే బోధించాలి



5వ తరగతి వరకు అదే మాధ్యమం కావాలి

‘శిక్షా పర్వ్‌’లో ప్రధాని నరేంద్రమోదీ స్పష్టీకరణ



న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: పాఠశాలల్లో విద్యాబోధన.. విద్యార్థుల మాతృభాషలోనే జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. కనీసం 5వ తరగతి వరకు స్థానిక భాషలోనే బోధించాలన్నారు. అయితే ఇంగ్లిషు సహా ఏ ఇతర అంతర్జాతీయ భాషను బోధించడంపైనా జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో ఎటువంటి నిషేధం లేదన్నారు. కానీ, భారతీయ భాషలను మాత్రం కచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 2022 నాటికి నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌) సిద్ధమవుతుందన్నారు. శుక్రవారం కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్వహించిన శిక్షా పర్వ్‌లో ప్రధాని మాట్లాడారు.


భాష అనేది విజ్ఞానాన్ని వ్యక్తపరచడానికి ఓ మార్గమని, భాషే యావత్తు విజ్ఞానం కాదని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారన్నారు. మాతృభాషలో విద్యా బోధన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాలలు సులువుగా నేర్చుకోగలిగే భాష ఏదైతే అదే బోధనా మాధ్యమంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులపై ఈ ఒత్తిడిని దూరం చేయడమే నూతన విద్యా విధానం లక్ష్యమన్నారు. కాగా, జై జగత్‌ నినాదం ఇచ్చిన ఆచార్య వినోబా భావే నుంచి, విశ్వమానవ సౌభ్రాతృత్వంపై సందేశమిచ్చిన స్వామి వివేకానంద నుంచి మానవాళి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మోదీ అన్నారు. శుక్రవారం ఈ ఇద్దరు మహనీయుల జయంతి నేపథ్యంలో వారికి ట్విటర్‌లో మోదీ నివాళులర్పించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మాతృభాషలోనే బోధించాలి"

Post a Comment