రేపే ‘నీట్
- సాధారణ దుస్తులే ధరించాలి
- విద్యార్థులకు డ్రెస్ కోడ్
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డ్రెస్ కోడ్ విధించింది. నీట్‌ను ఈనెల 13న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం... సాధారణ దుస్తులను మాత్రమే ధరించాలి. స్లిప్పర్లు, సాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. బురఖా లాంటివి ధరించేవారు నిర్దేశించిన సాధారణ సమయం కంటే ముందుగానే పరీక్ష హాలుకు చేరుకోవాలి. వీరిని తనిఖీ చేసి పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. కాగా, వైరస్ కారణంగా కట్టడి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలుండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కట్టడి ప్రాంతాల నుంచి వచ్చే వారిని కూడా ఎగ్జామినర్లుగా అనుమతించబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అందుకు సంబంధించి కేంద్రఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిబంధనలు విధించింది.
రాష్ట్రం నుంచి 55,800 మంది విద్యార్ధులు..
తెలంగాణ నుంచి ఈ ఏడాది నీట్ రాసే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఈసారి 55, 800 మంది విద్యార్ధులు పరీక్షను రాయబోతున్నారు. గత ఏడాది 54,073 మంది విద్యార్ధులు పరీక్షను రాశారు. అలాగే గత ఏడాది రాష్ట్రంలో నీట్ పరీక్ష కేంద్రాలు కేవలం 79 ఉండగా, ఈసారి వాటిని 112కు పెంచారు. హైదారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరికొన్ని మార్గదర్శకాలు...
విద్యార్ధులు, సిబ్బందికి వైరస్ అనుమానిత లక్షణాలుంటే వెంటనే వారిని ఐసోలేషన్ రూమ్‌కు పంపుతారు. ఒకవేళ లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆరోగ్య కార్యకర్తల సాయం తీసుకోవాలి.
పరీక్ష కేంద్రంలో తప్పనిసరిగా విద్యార్ధుల మధ్య 6 అడుగుల భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి. పరీక్ష కేంద్రం ఆవరణలో ఉమ్మివేయడం నిషేధం.
పరీక్ష కేంద్రాలతో పాటు, విద్యార్థులు తాకిన ప్రదేశాలను విధిగా శుభ్రం చేయాలి. వారు ప్రయాణించే వాహనాలనూ శానిటైజ్ చేయాలి.
విద్యార్ధులందరికీ తప్పనిసరిగా థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించిన తర్వాతే పరీక్ష హాలులోకి పంపిస్తారు.
ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే, సమీప ఆరోగ్య కేంద్రానికి పంపించి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాేస అవకాశాల్ని కల్పిస్తారు
0 Response to "రేపే ‘నీట్"
Post a Comment