విద్యార్థులను కుక్కేస్తున్నారు!
- ఐదంతస్థుల భవనాల్లో..
- ఇరికిరుకు గదుల్లో తరగతులు
- వంద మందికి ఒకే మరుగుదొడ్డి
- హాస్టళ్లలో ఆహారం నాసిరకం
- అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
- జూనియర్ కాలేజీల్లో పరిస్థితి ఇదీ...
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో అత్యంత దుర్భరమైన, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అనేక కాలేజీలు నాలుగు, ఐదంతస్థుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇరుకిరుకు గదులు.. వందల సంఖ్యలో విద్యార్థులు. వంద మందికి ఒకటి రెండు మరుగుదొడ్లే. కనీస సదుపాయాలు ఉండవు. హాస్టళ్లలో ఆహారం అత్యంత నాసిరకం. పౌష్టికాహారం మాటేలేదు. తగినన్ని నీళ్లు లేవు. అడుగుడుగునా నిబంధనలు ఉల్లంఘనలు’’ ఇదీ ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో నెలకొన్న పరిస్థితి అని తనిఖీ బృందాలు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో శుకవ్రారం తనిఖీలు జరిగాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 10 కాలేజీల చొప్పున ఎంపిక చేసి పాఠశాల విద్య, నియంత్రణ కమిషన్ పర్యవేక్షణలో మండల విద్యాధికారులు(ఎంఈవో) తనిఖీలు నిర్వహించారు. ఒక్కో టీమ్‌కు ఇద్దరు చొప్పున జిల్లాకు 20 మంది ఎంఈవోలు, కమిషన్ మెంబరు ఒకరు.. మొత్తం 21 మంది తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ తనిఖీల్లో ఆయా కాలేజీల్లోని లోపాలను గుర్తించారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కాలేజీలు అమలు చేయడం లేదని, సిలబస్ ఫాలో కావడం లేదని, ఫీజుల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని తేల్చారు. అనంతపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు నెలకు రూ.7 వేలు జీతం చెల్లిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రతి సంవత్సరం గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుచేసి దాని ప్రకారమే సిబ్బందికి జీతాలు చ్లెలంచాలి. ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్‌కు చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తుండం, వెలుతురు తగినంత లేకపోవడం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టళ్లలో అయితే వేకువ జామున 4 గంటలకే పిల్లలను లేపుతున్నారు. ఇది చదువుకునేందుకు కాదు సుమా.. తక్కువ మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉండటం వల్ల.. ఆలస్యంగా చేసే వారికి ఇబ్బందులు తప్పవు. దీంతో వారిని 4గంటలకే నిద్రలేపుతున్నారు. దీంతో విద్యార్థులకు సరైన నిద్ర కూడా ఉండడం లేదు. ఒకవేళ నిర్దేశిత సమయం కంటే ఆలస్యమ్తెతే ఇక ఆరోజు వారికి స్నానం చేసే అవకాశం ఉండదు. దీంతో శారీరక రోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆహారం కూడా సరిగ్గా ఉండటం లేదు. చాలీచాలని అన్నంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కాగా, తనిఖీ బృందాలు నమోదు చేసిన లోపాలను కమిషన్‌కు నివేదించనున్నాయి.
0 Response to "విద్యార్థులను కుక్కేస్తున్నారు!"
Post a Comment