విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్రాలు కట్టుబడాల్సిందే
- 8వ తరగతి వరకైనా మాతృభాషలోనే విద్యాబోధన
- హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదనలు
- తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, కనీసం 8వ తరగతి వరకైనా మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని చట్టంలో ఉందని పేర్కొంది. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి ఆంగ్ల మాధ్యమాన్ని చెప్పడమంటే అది విద్యాహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడమేనని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 వరకు ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేసేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 85, 81 జీవోలు రద్దు చేయాలని కోరుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్, సామాజిక ఉద్యమకారుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ జరిగింది. కేంద్రప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. సిలబస్, మాధ్యమ బోధన గురించి నిర్ణయించాల్సింది అకడమిక్ అథారిటీ అన్నారు. దానితో సంబంధం లేని పాఠశాల విద్యా కమిషనర్ ప్రతిపాదన ఆధారంగా ఆంగ్లమాధ్యమం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జాతీయ విద్యావిధానం, విద్యాహక్కు నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ జీవోల చట్టబద్ధతను తేల్చాల్సి ఉందన్నారు. తెలుగు మాధ్యమం లేకుండా చేయడమంటే తెలుగు కోరుకునే వారిపట్ల వివక్ష చూపినట్లే భావించాల్సి ఉంటుందన్నారు.
ఇంప్లీడ్ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పి.మహేశ్వరరావు, వైకే.శివాజీ వాదనలు వినిపిస్తూ.. ఆంగ్ల మాధ్యమం అమలుతో రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం అమలైతే పేదవర్గాలు అభివృద్ధి చెందుతాయని, దీనిని కొనసాగించాలని అభ్యర్థించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, అనూప్ కౌశిక్, సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఆంగ్లమాధ్యమంపై సరైన అధ్యయనం చేయలేదని, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమైనదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలు విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా లేవన్నారు. మైనారిటీ భాషలను రక్షిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మెజారిటీ ప్రజల భాషను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విద్యాచట్టంలో సవరణ చేస్తూ బిల్లు దాఖలు చేశామని, రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. నిబంధనల మేరకే జీవోలు జారీ చేశామన్నారు. ఆంగ్లమాధ్యమంలోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేశామని, అందువల్ల మాతృభాషకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వివరించారు. మైనారిటీ పాఠశాలల్లో మైనారిటీ భాషలైన తమిళం, కన్నడం, ఉర్దూ, ఒరియా మాధ్యమాలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. మాతృభాషలోనే విద్యాభ్యాసం ఉండాలని విద్యాహక్కు చట్టంలో పేర్కొనలేదని, ‘ఆచరణ సాధ్యం మేరకు మాతృభాషలో’ అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీల నుంచి సుమారు 48వేల తీర్మానాలు రాగా, అందులో 97శాతం ఆంగ్లమాధ్యమం కావాలని అభ్యర్థనలు ఉన్నాయని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం... తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

0 Response to "విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్రాలు కట్టుబడాల్సిందే"
Post a Comment