పదోన్నతుల్లో రిజర్వేషన్లపై కేంద్రం మల్లగుల్లాలు

 పదోన్నతుల్లో రిజర్వేషన్లపై కేంద్రం మల్లగుల్లాలు



ఈనాడు, దిల్లీ: పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీసే ప్రమాదముందని కేంద్రం పసిగట్టింది. ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని యోచిస్తోంది. ఆ బాధ్యతను న్యాయ, సామాజిక న్యాయశాఖలకు అప్పగించింది.

ఉత్తరాఖండ్‌ నీటిపారుదల శాఖకు సంబంధించి సహాయ ఇంజినీర్‌ పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 7న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల న్యాయపర విధి కాదు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కోరే ప్రాథమిక హక్కు ఏ వ్యక్తికీ లేదు’’ అని అందులో స్పష్టం చేసింది. వాదనల సందర్భంగా- రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(4), 16(4ఎ)లు ప్రాథమిక హక్కుల కిందకు రావని ఉత్తరాఖండ్‌లోని భాజపా సర్కారు పేర్కొంది. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో కాషాయపార్టీకి సంకట స్థితి తప్పలేదు. రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని, అందుకే అలాంటి వాదనలు వినిపించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  దీనికో పరిష్కారం కనుగొనాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకు 2 ప్రత్యామ్నాయాలను యోచిస్తున్నారు


1) సుప్రీంకోర్టు ఆదేశాలపై పునఃసమీక్ష కోరుతూ పిటిషన్‌ వేయడం.
2) లేదంటే ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా బిల్లు తీసుకురావడం.

‘‘పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపేందుకు సామాజిక న్యాయశాఖ ప్రయత్నిస్తోంది. ఒకవేళ సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తే మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే మలివిడత బడ్జెట్‌ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది.’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి


మరోవైపు ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రస్తుతమున్న రూ.8 లక్షల గరిష్ఠ వార్షికాదాయ పరిమితిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదోన్నతుల్లో రిజర్వేషన్లపై కేంద్రం మల్లగుల్లాలు"

Post a Comment