జనవరి నుంచి ఉచితంగా ‘ఆన్‌లైన్ నెఫ్ట్’ సేవలు
ఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేలా ఆర్‌బీఐ మరో ప్రతిపాదన చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి పొదుపు ఖాతాదారుల నుంచి ఆన్‌లైన్ నెఫ్ట్ (నేషనల్ ఎలకా్ట్రనిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్) లావాదేవీలకు ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. దీంతో జనవరి 1 నుంచి బ్యాంక్ కస్టమర్లకు ఆన్‌లైన్ నెఫ్ట్ చెల్లింపులు
ఉచితం కానున్నాయి.
నెఫ్ట్ అంటే?
ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక ఖాతాకు నిధులు బదిలీ చేసేందుకు ఏర్పాటు చేసిన చెల్లింపుల వ్యవస్థే నెఫ్ట్. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లేదా బ్యాంక్ బ్రాంచ్‌కెళ్లి కూడా ఈ సేవలను పొందవచ్చు. అయితే అన్ని బ్యాంక్ బ్రాంచ్‌ల్లో నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని గంటల్లో దేశంలోని ఏదైనా బ్యాంక్ ఖాతాకు నిధులు బదిలీ చేయవచ్చు. నెఫ్ట్ ద్వారా నిధుల బదిలీకి కనీస లేదా గరిష్ఠ పరిమితి ఏం లేదు. డిసెంబరు నుంచి నెఫ్ట్ సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కేవలం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సేవలు
అందిస్తున్నారు.
ఫాస్టాగ్స్‌తో పార్కింగ్ ఫీజు చెల్లింపులు
పార్కింగ్ రుసుము, బంకుల్లో ఇంధన కొనుగోలుకు ఫాస్టాగ్స్‌తోనూ చెల్లింపులు జరిపే అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం నేషనల్ ఎలకా్ట్రనిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్స్‌తో అన్ని రకాల చెల్లింపు వ్యవస్థలు, సాధనాలను (నాన్ బ్యాంక్ పీపీఐ, కార్డులు, యూపీఐ) అనుసంధానించేందుకు అనుమతించనున్నారు. టోల్ గేట్ల వద్ద ఆన్‌లైన్ చెల్లింపులు జరిపేందుకు ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టారు. తరచుగా జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు, ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించేవారి సౌలభ్యం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చారు.
జూలైలోనే చెప్పింది
నెఫ్ట్‌తోపాటు రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) లావాదేవీలపై రుసుము ఎత్తివేయాలని అనుకుంటున్నట్లు ఆర్‌బీఐ జూలై పరపతి సమీక్ష సందర్భంగానే ప్రకటించింది. అయితే, ఎప్పటి నుంచి అమలులోకి తేనున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం నాడు ఆన్‌లైన్ నెఫ్ట్ చార్జీల రద్దుపై బ్యాంకులను నిర్దేశించింది. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ మాత్రం తన కస్టమర్లకు జూలైలోనే ఊరట కల్పించింది. ఆన్‌లైన్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్) నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ (తక్షణ చెల్లింపు సేవ) చార్జీలను రద్దు చేసింది
0 Response to "జనవరి నుంచి ఉచితంగా ‘ఆన్‌లైన్ నెఫ్ట్’ సేవలు"
Post a Comment