కొత్త జిల్లాలపై నివేదిక

జేసీలకు ఆదేశాలు జారీ చేసిన సీసీఎల్‌ఏ



ముందుగా మండల, రెవెన్యూ డివిజన్‌ల పునర్‌వ్యవస్థీకరణ!



అటవీ ప్రాంతమంతా 'అల్లూరి' పేరుతో పెద్ద జిల్లాగా...


అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక కసరత్తును రెవెన్యూశాఖ చేపట్టింది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని అధికార వైసీపీ ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటి వివరాలను వెంటనే నివేదించాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. 


ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల భౌగోళిక స్వరూపం, భూ విస్తీర్ణం, జనాభా, గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్నారు



ప్రతిపాదిత మరో 12 జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా అందించాలంటూ కోరారు. జిల్లాలుగా లేని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు, ఇంకా మొత్తం నియోజకవర్గం పరిధిలో భూ విస్తీర్ణం, జనాభా, అటవీ విస్తీర్ణం, సామాజిక జీవనం వంటి అనేకాంశాలపై సమగ్ర నివేది పంపించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్‌ కోరినట్లు తెలిసింది.


 దీనిపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) మంగళవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్లతో మాట్లాడినట్లు తెలిసింది.


గిరిజన జిల్లాకు సంబంధించి స్పష్టత తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అరకు లోక్‌సభ పరిధిలో ఏడు నియెజకవర్గాలున్నాయి. ప్రస్తుతం ఇది విశాఖ జిల్లాలో ఉంది. దీని పరిధిలో ప్రస్తుత విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని పాడేరు, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.




 ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాలు ఎస్టీలకు రిజర్డ్వ్‌ కాగా... ఒకటి మాత్రం ఎస్సీలకోసం కేటాయించింది. దీనిని కూడా గిరిజన జిల్లా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. గిరిజన జిల్లా ప్రకటిస్తే అల్లూరి సీతారామరాజు స్మారకంగా పేరుపెట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. 


ఇందులో విశాఖ జిల్లాలోని నర్సీపట్నాన్ని కూడా చేర్చవచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే... విస్తీర్ణంలోనూ ఇదే పెద్దదిగా ఉంటుంది. మరోవైపు జిల్లాల విభజనకు ముందుగానే మండలాలు, రెవె న్యూ డివిజన్‌ల పునర్‌వ్యవస్థీకరణ చేపడితేనే జిల్లాల ఏర్పాటు సజావుగా సాగుతుందని, కేంద్రం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రావని అధికారవర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుత జిల్లాలు: 1. శ్రీకాకుళం 2. విజయనగరం. 3. విశాఖపట్నం. 4. తూర్పుగోదావరి (పరిపాలనా కేంద్రం కాకినాడ). 5. పశ్చిమగోదావరి(పరిపాలనా కేంద్రం ఏలూరు) 6. కృష్ణా (పరిపాలనా కేంద్రం మచిలీపట్నం) 7. గుంటూరు, 8. ప్రకాశం 9. నెల్లూరు. 10. కడప. 11. కర్నూలు. 12. అనంతపురం. 13. చిత్తూరు. ఇందులో కాకినాడ, ఏలూరు, మచిలీపట్నంలు మూడూ లోక్‌సభ స్థానాలే. ఇప్పటికే అవి పరిపాలనా కేంద్రాలుగా ఉన్నాయి.


పరిశీలనలో కొత్త జిల్లాలు: 1. అనకాపల్లి (విశాఖ జిల్లా), 2. అరకు (విశాఖ జిల్లా), 3. అమలాపురం (తూర్పుగోదావరి), 4. రాజమండ్రి (తూర్పుగోదావరి), 5 నర్సాపురం (పశ్చిమగోదావరి), 6. విజయవాడ (కృష్ణా జిల్లా), 7. నర్సరావుపేట (గూంటూరు జిల్లా), 8. బాపట్ల (గూంటూరు జిల్లా), 9. నంద్యాల (కర్నూలు జిల్లా), 10. హిందూపురం (అనంతపురం జిల్లా), 11. రాజంపేట (కడప జిల్లా). 12. తిరుపతి (చిత్తూరు జిల్లా


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కొత్త జిల్లాలపై నివేదిక"

Post a Comment