బడి ఫీజుల బాంబు ఏటా 10-25% రుసుములు పెంచేస్తున్న ప్రైవేటు పాఠశాలలు మధ్య తరగతిపై పెను భారం నిబంధనలు పట్టని యాజమాన్యాలు
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు సామెతకి ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చూడు.. అని కలుపుకోవాల్సిన పరిస్థితి. చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు మూడేళ్లకు ఒకసారి మాత్రమే బోధన రుసుములు పెంచాలి.
ప్రభుత్వం నిర్ణయించిన లేక కమిటీ ఆమోదించిన రుసుము కన్నా ఎక్కువ మొత్తాన్ని ఏ రూపంలో వసూలు చేసినా విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(2) ప్రకారం ఆ పాఠశాల యాజమాన్యాన్ని శిక్షించవచ్చు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఏటా 10-25 శాతం మేర రుసుములు పెంచేస్తున్నాయి.
ఐఐటీ, ఒలింపియాడ్, సాఫ్ట్ స్కిల్స్ ఇలా ఏదో ఒక కొత్త పేరు తగిలించి ముక్కుపిండి మరీ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. పెంపుపై ప్రశ్నిస్తే టీసీ తీసుకుని వెళ్లిపోవాలని ఖరాఖండీగా చెబుతున్నాయి. దీంతో పాఠశాలలు తెరుస్తున్నారంటేనే మధ్య తరగతి తల్లిదండ్రులు హడలి పోతున్నారు. ఫీజుల కోసం అప్పులు చేస్తున్నారు. యాజమాన్యాలు రుసుముల పెంపునకు నిబంధనలు పాటిస్తున్నాయా? మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయా? అని తనిఖీ చేసేవారే కరవయ్యారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన యార్లగడ్డ ఈశ్వరరావు ఆదాయం ఏడాదికి 1.10 లక్షలు. ఇంటర్ మాత్రమే చదువుకున్న ఈశ్వరరావు తన కుమారులను ఉన్నత విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. 7, 4 తరగతులు చదువుతున్న వారి రుసుములు, పుస్తకాలు, ఏకరూప దుస్తులకు కలిపి ఏటా రూ.45 వేలకు పైగా చెల్లిస్తున్నారు.
ఆయన ఆదాయంలో 41% పిల్లల చదువులకే ఖర్చు చేస్తున్నారు. ఏటా పాఠశాల యాజమాన్యం రూ.3-6 వేల వరకు రుసుములు పెంచుతుండడంతో తమకు భారమవుతోందని, రుసుముల పెంపుపై పాఠశాల సిబ్బందిని ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం లేదని ఈశ్వరరావు వాపోయారు.
కర్నూలుకు చెందిన గోవింద్ ఆదాయం నెలకు రూ.25 వేలు. కార్పొరేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాబు, యూకేజీ చదువుతున్న పాపకు రుసుములు, దుస్తులు, బూట్లు, ఇతరత్రా కింద ఏటా రూ.50-60 వేలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలు తెరిచే సమయం దగ్గరపడడంతో రుసుములు చెల్లించేందుకు డబ్బులు లేక 2 రూపాయల వడ్డీకి రూ.50 వేలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రైవేటు కంపెనీలో పని చేసే కె.మణికుమార్ నెల వేతనం రూ.30 వేలు. ఆయన ఆదాయంలో 22 శాతాన్ని తన ఇద్దరు పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నారు. ఎల్‌కేజీ చదివే పాప పాఠశాల రుసుము, డొనేషన్, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చుల కింద ఏడాదికి రూ.52,100, మరో ప్రైవేటు బడిలో మూడో తరగతి చదువుతున్న బాబుకు రూ.27,400 చెల్లిస్తున్నారు. పిల్లలు పైతరగతులకు వెళ్లే కొద్దీ ఈ రుసుములు మరింత పెరిగి భారంగా మారతాయని వాపోయారు.
ఆయనో ఉద్యోగి. ఆదాయం నెలకు రూ.80 వేలు. ఆయన కుమారుడు విజయవాడలో ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదవబోతున్నాడు. 8వ తరగతిలో రూ.65 వేలు ఉన్న రుసుము పదో తరగతికి వచ్చేసరికి రూ.1.10 లక్షలకు చేరింది. ఐఐటీ ప్రత్యేకమంటూ అదనంగా వసూలు చేస్తున్నారని, నిజానికి ఎలాంటి అదనపు సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన వెల్లడించారు.
పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారిని ఉన్నత స్థానాల్లో చూడాలన్న తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ధనార్జనే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. ప్రాథమిక తరగతులకే వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు ఏటా ఫీజుల పెంపు.. ఇవన్నీ మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయి. ఇష్టారీతిన ఫీజులు పెంచడానికి వీల్లేదంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టం కోరల్లేని పాములా మారింది. జీవో 1 ప్రకారం పాఠశాలలు 5% మించి లాభాలు తీసుకోకూడదనే నిబంధన అమలుకు నోచుకోవడంలేదు.
విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి
రుసుముల నియంత్రణకు విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి 2010లో జీవో 42(2) తెచ్చారు. దీని ప్రకారం నిర్ణయించిన రుసుములోనే కంప్యూటర్, ఇతర ప్రయోగశాలలు, క్రీడలు తదితరాలన్నీ కల్పించాలి. ఏ ఇతర పేర్లతో ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు.
రుసుముల పెంపు, ఫిర్యాదులపై జిల్లా రుసుముల నియంత్రణ కమిటీ పరిశీలించాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు.
* ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కన్నా ఎక్కువ వసూలు చేయాలని భావించిన పాఠశాలలు నూతన రుసుముల వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. దీనిపై ప్రైవేటు పాఠశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వుల అమలు నిలిచిపోయింది.
* ప్రైవేటు సంస్థలు రుసుమును నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి మాత్రమే వసూలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకేసారి మొత్తం వసూలు చేయకూడదు.
* విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుములకు పాఠశాల ప్రత్యేక బ్యాంకు ఖాతాలు నిర్వహించి, ఏటా ఆడిట్ చేయించాలి.
న్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే టెక్నో, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
* కార్పొరేట్ పాఠశాలలు ప్రధానంగా ఐఐటీ పేరుతో ఏడాదికి రూ.65 వేల నుంచి రూ.95 వేలు వసూలు చేస్తున్నాయి. ఏసీ తరగతులకు పదో తరగతి విద్యార్థికి రూ.1.10 లక్షల వరకు దండుకుంటున్నాయి.
* విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులోని కొన్ని పాఠశాలలు రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయి.
కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని పాఠశాలలు రూ.10-25 వేలు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు డొనేషన్లు తీసుకొని ఎలాంటి వడ్డీ లేకుండా పిల్లవాడు బడి నుంచి వెళ్లిపోయే సమయంలో తిరిగి చెల్లిస్తున్నాయి.
* ఇప్పుడు చాలా పాఠశాలలు సాఫ్ట్‌స్కిల్స్‌ను ప్రవేశ పెడుతున్నాయి. ఇందుకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్ నేర్పించేందుకంటూ మరికొంత దండుకుంటున్నాయి.
5 శాతమే లాభాలు తీసుకోవాలి
పాఠశాల విద్యార్థుల రుసుముల నియంత్రణకు ప్రభుత్వం 1994లో జీవో 1 తీసుకొచ్చింది. దీని ప్రకారం పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేసే రుసుముల్లో 5 శాతం మాత్రమే లాభాలు తీసుకోవాలి. మొత్తం రుసుముల్లో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలు, 45 శాతం ఉపాధ్యాయుల గ్రాట్యుటీ, రోజువారీ ఖర్చులు, మౌలిక వసతులకు వెచ్చించాలి. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగమంటూ ఏమీ లేదు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద పిల్లలకు ఇవ్వాలి. ఇందుకు నిర్ణీత రుసుములను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రంలో అమలు కావడం లేదు. రుసుములు పెంచేస్తున్నారని మాకు ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిని అయా విభాగాలకు పంపిస్తుంటాం. పట్టణాల్లో ఎలాంటి సదుపాయాలు లేకుండానే అపార్టుమెంట్లలో పాఠశాలలను ఏర్పాటు చేసి, రూ.30-60 వేల వరకు రుసుములు వసూలు చేస్తున్నారు. రుసుముల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- బీవీఎస్ కుమార్, ఛైర్మన్, పిల్లల సంక్షేమ కమిటీ
జాతీయ విద్యా విధానంపై ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన కస్తూరి రంగన్ కమిటీ సైతం ప్రైవేటు పాఠశాలల రుసుములను ప్రస్తావించింది. ఇష్టారాజ్యంగా కాకుండా ద్రవ్యోల్బణం, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని పెంచాలని సూచించింది. రుసుముల సవరణ ప్రతి మూడేళ్లకోసారి ఉండాలని పేర్కొంది. నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
0 Response to "బడి ఫీజుల బాంబు ఏటా 10-25% రుసుములు పెంచేస్తున్న ప్రైవేటు పాఠశాలలు మధ్య తరగతిపై పెను భారం నిబంధనలు పట్టని యాజమాన్యాలు"
Post a Comment