1.80 లక్షల గ్రామ వలంటీర్లు!
*📚✍1.80 లక్షల గ్రామ వలంటీర్లు!*
*♦ప్రాథమికంగా అంచనా*
*♦ఎంపికకు మొదలైన కసరత్తు*
*♦పట్టణాల్లోనూ 70 వేల మందికి అవకాశం*
*♦స్థానికులకు ప్రాధాన్యం*
*♦ముఖ్యమంత్రితో చర్చించాక మరింత పెరిగే వీలు*
*🌻ఈనాడు, అమరావతి:* ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంలో క్రియాశీలక ప్రాత పోషించేలా గ్రామాల్లో వలంటీర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 13 జిల్లాల్లో 1.80 లక్షల మందిని నియమించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులతో మంగళవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రితో చర్చించాక ఆయన సూచనల మేరకు అవసరమైన సవరణలు చేసి అమలుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. గ్రామాల్లో యాభై కుటుంబాలకో వలంటీర్‌ను నియమించి నెలకు రూ.5 వేలు చొప్పున వేతనం చెల్లిస్తామని ప్రమాణ స్వీకారోత్సవ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
🌻ఆగస్టు 15 నుంచి వలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి హామీపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 90 లక్షల కుటుంబాలున్నాయని రెండేళ్ల క్రితం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. వీరిలో 50 కుటుంబాలకో వలంటీర్‌ను నియమించాలంటే ఎంతమంది అవసరమవుతారు? ఏవిధంగా ఎంపిక చేయాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై జవహర్‌రెడ్డి తాడేపల్లిలోని సంచాలకుని కార్యాలయంలో అధికారులతో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక లెక్కల ప్రకారం 1.80 లక్షల వలంటీర్లు అవసరమని ప్రతిపాదించినా.. ముఖ్యమంత్రితో సమావేశం తరువాత ఈ సంఖ్యను పెంచుతారా? అనేది చూడాలి. ఎందుకంటే..జగన్‌మోహన్‌రెడ్డి 4 లక్షల మందిని నియమిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. వలంటీర్ల ఎంపికకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యమివ్వనున్నారు. దరఖాస్తులను మీ-సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో స్వీకరించి మండల స్థాయి అధికారులతో ఏర్పాటుచేసే కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ముఖ్యమంత్రితో చర్చించాక విధివిధానాలు ఖరారు చేసి అధికారిక ప్రకటన చేయనున్నారు. ముసాయిదా దశలో ఉన్నందున ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడేందుకు అధికారులు సుముఖత చూపడం లేదు.
🌻నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ ప్రతి యాభై కుటుంబాలకో వలంటీర్‌ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పట్టణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వార్డులు/డివిజన్ల వారీగా కూడా అవసరమని భావించి ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 110 పట్టణ స్థానిక సంస్థల్లో 70 వేల మందిని నియమించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "1.80 లక్షల గ్రామ వలంటీర్లు!"
Post a Comment