జిపియస్ మాకొద్దు- ఉద్యోగసంఘాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీము(జిపిఎస్)పై ఉద్యోగసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
పాత పెన్షన్ స్కీమే కావాలని డిమాండ్ చేస్తున్నాయి. పలు పత్రికల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌పై జారీ చేసిన ప్రకటన ఉద్యోగుల్లో చర్చ నీయాంశమైంది. ఈ ప్రకటనల్లో వాస్తవాలను వక్రీకరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సిపిఎస్‌ను రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరితే దాని బదులు మరొకటి తీసుకువస్తామని చెప్పడం ఏమిటని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 20 ఏళ్లపాటు పెరిగే ఖర్చులను చూపిస్తున్న ప్రభుత్వం అదే సమయంలో పెరిగే ఆదాయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి.
జిపిఎస్ ప్రత్యామ్నాయం కాదు : యుటిఎఫ్
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తుంటే సిపిఎస్ బదులు జిపిఎస్ తెస్తామని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్లర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాదు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓపిఎస్ అమలు వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వాలకు ఆర్థిక భారం పెరుగుతుందని లెక్కలు గట్టి ప్రకటించడం, ఇచ్చిన హామీని అమలు చేయకుండా దాటవేయడానికేనని వీరు విమర్శించారు. జిపిఎస్ వల్ల 33 శాతం పెన్షన్ వస్తుందని చెప్పే ప్రభుత్వం గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పిఎఫ్ సదుపాయాల విషయమై పెదవి విప్పలేదని తెలిపారు. ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఇచ్చే పెన్షన్ కన్నా కాంట్రిబ్యూషన్‌తో ఇచ్చే జిపిఎస్ ఎలా మెరుగైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండు చేశారు. ఉద్యోగుల చేత సేవ చేయించుకుని వయస్సు మళ్లిన తరువాత ఇచ్చే పెన్షన్ భారమని చెప్పడం సబబుకాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండు చేశారు.
సిపిఎస్‌ను రద్ద చేయాల్సిందే : కె.ఎస్ లక్ష్మణరావు
రాష్ట్రంలో 1.90 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు కోసం ఎదురుచూస్తున్నారని, అనేక ఉద్యమాలు చేశారని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు కోరారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్‌ఘర్ ప్రభుత్వాలు సిపిఎస్‌ను రద్దు చేసిన నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి కూడా రాజకీయ నిర్ణయం తీసుకుని సిపిఎస్ రద్దు చేస్తారని ఉద్యోగులు ఆశించారని తెలిపారు. దినపత్రికల్లో రెండు పూర్తిపేజీల ప్రకటనల్లో సిపిఎస్ రద్దు బదులు జిపిఎస్ పెడతామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు . సిపిఎస్ రద్దు ఈ రోజు రాజకీయ ఎజెండాగా మారిందని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని పిడిఎఫ్ తరుఫున డిమాండు చేశారు.
.
ఒపిఎస్సే కావాలి : ఎన్‌జిఓ సంఘం
జిపిఎస్‌ను తాము ఒప్పుకోడం లేదని, ఓపిఎస్‌నే అమలు చేయాలని ఎపి ఎన్‌జిఓ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి తెలిపారు. ఎటివంటి కాంట్రిబ్యూషన్ లేని పాత పెన్షన్ విధానాన్ని కాదని కాంట్రిబ్యూషన్‌తో ఏర్పాటు చేసే జిపిఎస్‌ను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఇంతకంటే మెరుగైన విధానాన్ని గత ప్రభుత్వంలో అప్పటి సిఎస్ ఠక్కర్ ప్రతిపాదిస్తే తాము వ్యతిరేకించామని వారు అన్నారు. జిపిఎస్ విధానం ఉద్యోగులకు ఎవరికీ ఇష్టం లేదని పేర్కొన్నారు.
అంగీకరించం: జెఎసి అమరావతి
జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఎపి జెఎసి అమరావతి అధ్యక్షులు బప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తమకు ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు చేయాలని డిమాండు చేశారు. 10 శాతం ప్రభుత్వం 10 శాతం ఉద్యోగులు కడితే రిటైర్మెంట్ తరువాత 33 శాతం, 14 శాతం కడితే 40 శాతం వచ్చేలా రెండు ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోవాలని చెబుతున్నారని, ఇదెలా సమంజసమని ప్రశ్నించారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, కనీస చర్చ కూడా లేకుండా పేపర్లో ప్రకటన ఇచ్చి ఎంచుకోవాలని చెప్పడం ఏమిటని అన్నారు.
ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చర్య : సిఐటియు
ఆదాయం అంతా ఉద్యోగులకే పోతుందనే విధంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉందని, ఇది ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చర్యని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.గఫూర్ అన్నారు. ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం కోరుకునేవారు పాత పెన్షన్ స్కీముకు వెళ్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త స్కీములు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జిపిఎస్ కింద ప్రభుత్వం ఇచ్చిన లెక్కలన్నీ తప్పుడు సమాచారమని, ప్రభుత్వం ఈ విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజస్థాన్, చత్తీస్‌ఘర్ ప్రభుత్వం ఇప్పటికే ఓపిఎస్ అమలు చేస్తున్నాయని, ఎపి మాత్రం ఓపిఎస్‌కు సిద్ధపడటం లేదని అన్నారు. ఆదాయం, ఖర్చుల విషయంలో ప్రభుత్వం అతితెలివి ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల వ్యతిరేక వాతావరణం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ప్రకటన ఇవ్వడమంటే బలవంతంగా అమలు చేయాలనుకోవడం తప్ప మరొకటి కాదని తెలిపారు
0 Response to "జిపియస్ మాకొద్దు- ఉద్యోగసంఘాలు"
Post a Comment