పాఠశాలల అభివృద్ధికి ఎవరు ముందుకొస్తారు? విరాళాలిచ్చే దాతలను గౌరవించడం ఇలాగేనా? విద్యాశాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు మే 5న పాఠశాల విద్య డైరెక్టర్‌ హాజరుకు ఆదేశం


 

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): పాఠశాల అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చిన దాతలు సూచించిన పేరు పెట్టేందుకు అధికారులు నిరాకరించడంపై హైకోర్టు మండిపడింది. ఇలాంటి వ్యవహారశైలి వల్ల పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి విరాళాలు ఇచ్చేందుకు, రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పాలుపంచుకొనేందుకు ఎవరూ ముందుకురారని వ్యాఖ్యానించింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునేవారిని గౌరవించేంది ఇలాగేనా అని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుతో అంతిమంగా ప్రజలకే నష్టం జరుగుతుందని పేర్కొంది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పూర్తి రికార్డులతో మే 5న కోర్టు ముందు హాజరు కావాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలోని జిల్లా షరిషత్‌ పాఠశాలకు తన తండ్రి నారపురెడ్డి సీతారామిరెడ్డి పేరు పెట్టాలని కోరుతూ ఇచ్చిన వినతిని పాఠశాల విద్యశాఖ డైరెక్టర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కాలవ సురేశ్‌కుమార్‌ రెడ్డి వాదనలు వినిపించారు. స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను దత్తత తీసుకొన్న పిటిషనర్‌... దాని అభివృద్ధి కోసం రూ.41లక్షలు ఖర్చు చేశారన్నారు. ఆ బడికి పిటిషనర్‌ తండ్రి పేరు పెట్టేందుకు గ్రామపంచాయితీ, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ 2021 సెప్టెంబరు 6న తీర్మానం చేసి డీఈవోకి పంపించారన్నారు. ఆర్‌జేడీ ప్రొసీడింగ్స్‌ను పాఠశాల విద్యశాఖ డైరెక్టర్‌కు పంపగా, సహేతుకమైన కారణాలు లేకుండా తిరస్కరించారన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.... పిటిషనర్‌ వినతిని తిరస్కరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పాఠశాలలకు పేరు పెట్టే విషయంలో ప్రభుత్వం 2021 అక్టోబరులో జీవో 13 జారీ చేసిందన్నారు. వాటి ఆధారంగా పిటిషనర్‌ అభ్యర్థను అనుమతించడం సాధ్యపడదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.... పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ విద్యశాఖ డైరెక్టర్‌ చెప్పిన కారణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవో 13 జారీకి ముందే పిటిషనర్‌ వినతిపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే తరహా వ్యవహారశైలి కొనసాగితే పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి నిమిత్తం విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకురారన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల అభివృద్ధికి ఎవరు ముందుకొస్తారు? విరాళాలిచ్చే దాతలను గౌరవించడం ఇలాగేనా? విద్యాశాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు మే 5న పాఠశాల విద్య డైరెక్టర్‌ హాజరుకు ఆదేశం"

Post a Comment