పాజిటివిటీ రేటు పైపైకి



రాష్ట్రంలో 11.37 శాతంగా నమోదు 


కొత్తగా 4,528 మందికి కరోనా 


మంత్రి ముత్తంశెట్టికి, ధర్మానకు పాజిటి

అమరావతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు పైపైకి దూసుకుపోతోంది. గత 24గంటల్లో 39,816 మందికి పరీక్షలు నిర్వహించగా 4,528 కేసులు వెలుగులోకి వచ్చినట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో పాజిటివిటీ రేటు కూడా 11.37 శాతానికి పెరిగింది. తాజాగా చిత్తూరులో 1,027, విశాఖ 992, శ్రీకాకుళం 385, గుంటూరు 377, తూర్పుగోదావరి 327, అనంతపురం 300, కృష్ణాజిల్లాలో 166 చొప్పున కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,96,755 మంది కొవిడ్‌ బారిన పడగా 20,63,934 మంది కోలుకున్నారు. కరోనాతో ప్రకాశం జిల్లాల్లో మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 14,508కు పెరిగాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 18,313 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు రెండోసారి కరోనా సోకింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే  ధర్మాన ప్రసాదరావుకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

ఆలయాల్లో కొవిడ్‌ ఆంక్షలు: 


కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు. గతేడాది అమలుచేసిన ప్రొటోకాల్‌ను ఆలయాల్లో విధిస్తూ దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్యూలైన్ల ప్రారంభంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటుచేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏ ఆలయంలో అయినా గంటకు వెయ్యి మందికి మించి దర్శనానికి రాకుండా చర్యలు తీసుకోవాలని, సేవా టికెట్ల జారీని 50శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది. అంతరాలయ దర్శనాలు పూర్తిగా ఆపేయాలని, తీర్థం, ప్రసాదం, శఠారి ఉండకూడదని, మాస్క్‌ లేని భక్తులను ఆలయాల్లోకి అనుమతించకూడదని తెలిపింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాజిటివిటీ రేటు పైపైకి"

Post a Comment