ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాలు నేడు నీట్‌-పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం?



దిల్లీ: పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌’లో... ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటా అమలుపై సుప్రీంకోర్టు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇందుకు సంబంధించిన కేసుల్లో ఉత్తర్వులను గురువారం రిజర్వు చేసింది. ఈ అంశంలో సంబంధిత పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నల ధర్మాసనం ఆదేశించింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కౌన్సెలింగ్‌ను ప్రారంభించాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

‘కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలి’...

కాగా, నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలంటూ సుప్రీంకోర్టును ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆశ్రయించింది. ఈ ప్రక్రియ చివరి సమయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సవరించడం వల్ల తుది ఎంపిక మరింత జాప్యమవుతుందని పేర్కొంది. ఈ విషయంలో ఇప్పటికే దాఖలైన కేసుల్లో తమనూ పార్టీగా చేర్చాలని అభ్యర్థించింది. ‘‘నీట్‌-పీజీ ద్వారా ఏటా 45 వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్‌ వైద్యులుగా ఎంపికవుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో జూనియర్‌ వైద్యులు అందుబాటులోకి రాలేదు. దీంతో పీజీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. కొందరు కొవిడ్‌బారిన పడ్డారు. చివరికి ఇది మొత్తం ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతోంది’’ అని ఫెడరేషన్‌ తన పిటిషన్‌లో వివరించింది.

సమస్య ఎందుకంటే...

2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిరుడు జులైలో నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే, నీట్‌-పీజీ అభ్యర్థులు కొందరు దీన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రవేశాలు జాప్యమవుతుండటాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాలు నేడు నీట్‌-పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం?"

Post a Comment