ఫస్ట్‌న జీతం పడలేదు
సెక్రటేరియట్, హెచ్‌ఓడీలకూ ఆపేశారు
ఈ విభాగాలకు ఆగడం చరిత్రలో ప్రథమం
రాత్రి 8 తర్వాత కొద్దిమంది ఉద్యోగులకు జమ!
రాష్ట్ర ఖజానాకి ఆదాయం తగ్గడం లేదు.. అప్పులూ ఆగడం లేదు. అయినా, ఫస్ట్ వస్తే కటకటే! ఠంచనుగా ఒకటిన అందాల్సిన వేతనాల కోసం ఉద్యోగులు, సామాజిక పింఛన్ల కోసం అవ్వాతాతలకు ఎదురుచూపులే! ఏనాడూ ఫస్ట్ వేతనంకోసం ఎదురుచూడని హెచ్‌ఓడీలు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సైతం ఉదయం నుంచీ పడిగాపులే!
అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరం.. జనవరి ఒకటో తేదీ.. శుభారంభాలే ఉండాలని అంతా కోరుకుంటారు. కానీ జగన్ పాలనలో కనీస శుభాలూ కరువే. ఒకటోతేదీన రొటీన్‌గా అందాల్సిన జీతాలు, పెన్షన్లు అందనే లేదు. సాధారణంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీలకు జీతాలు ఆగవు. ఫస్ట్‌నే డ్రా చేసుకుంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా గత ఏడాది వరకు వారందరికీ నెలలో మొదటి తేదీనే జీతాలు అందాయి. అలాంటిది ఈసారి వారికీ ఆపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పడలేదు. ఉదయం నుంచి ఎదురుచూడగా, రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొద్దిమందికి మాత్రం ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అదీ స్వల్పసంఖ్యలోనే. పెన్షన్లకు మాత్రం ఆ మాత్రం కూడా జమ కాలేదు. చాలా మంది ఉద్యోగులు తమ ఈఎంఐలను ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మధ్యలో పెట్టుకుంటారు. కానీ, జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి వీరికి వేతనాలు సకాలంలో అందకపోవడంతో వడ్డీకి తెచ్చి ఈఎంఐలు కట్టి వేతనం వచ్చాక వాటిని తీర్చుతున్నారు. పీఆర్సీని తేల్చకుండా ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం వేతనాలపైనా వేధిస్తోంది. పీఆర్సీ అడిగితే వేతనాలు తగ్గిస్తామంటున్న ప్రభుత్వం ఇ ప్పుడు ఉన్న వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. అలాగే, ప్రతి నెల రెండు రోజుల ముందే బ్యాంకుల నుంచి సామాజిక పెన్షన్ల డబ్బులు డ్రా చేసే అధికారులు ఖజానాలో డబ్బుల్లేకపోవడంతో శనివారం ఉదయం నుంచి బ్యాంకుల కెళ్లి అవ్వాతాతల పెన్షన్ డబ్బులు అరకొరగా డ్రా చేశారు. ఆర్‌బీఐ వద్ద ఓడీకి వెళ్లి ఈ డబ్బులు తెచ్చినట్టు తెలుస్తోంది. వేతనాలు, పెన్షన్ల కోసం మళ్లీ అదే బాట పడుతున్నట్టు తెలుస్తోంది.
0 Response to "ఫస్ట్‌న జీతం పడలేదు"
Post a Comment