Universe: సుదూర విశ్వంలో సరికొత్త గ్రహం! నక్షత్రానికి చేరువగా పరిభ్రమిస్తున్నట్లు గుర్తించిన భారత శాస్త్రవేత్తలు





బెంగళూరు: సుదూర విశ్వంలో ఓ సరికొత్త గ్రహాన్ని భారత ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఓ నక్షత్రం చుట్టూ అది అత్యంత సమీపం నుంచి పరిభ్రమిస్తున్నట్లు నిర్ధారించారు. సంబంధిత వివరాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌) పరిశోధక బృందం ‘పీఆర్‌ఎల్‌ అడ్వాన్స్‌డ్‌ రేడియల్‌ వెలాసిటీ అబు-స్కై సెర్చ్‌ (పారస్‌)’ అనే సాంకేతికత సాయంతో సౌర కుటుంబం ఆవల నూతన గ్రహాన్ని (హెచ్‌డీ 82139బి) గుర్తించింది. భూమికి 725 కిలోమీటర్ల దూరంలోని ఓ ముసలి నక్షత్రం (హెచ్‌డీ 82139) చుట్టూ అది పరిభ్రమిస్తోంది. ఆ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడితో పోలిస్తే 1.5 రెట్లుగా ఉంది. కొత్తగా గుర్తించిన గ్రహం ద్రవ్యరాశి.. గురుగ్రహం ద్రవ్యరాశిలో 70%. బృహస్పతితో పోలిస్తే దాని పరిమాణం మాత్రం 1.4 రెట్లుగా ఉంటుంది. నక్షత్రం చుట్టూ 0.05 ఆస్ట్రానమికల్‌ యూనిట్ల దూరంలోనే హెచ్‌డీ 82139బి తిరుగుతోంది. సూర్యుడు, బుధుడి మధ్య దూరంలో అది పదో వంతు. ఒక్కో పరిభ్రమణాన్ని పూర్తిచేసేందుకు ఈ గ్రహానికి 3.2 రోజులే పడుతోంది. నక్షత్రానికి అత్యంత చేరువలో ఉండటంతో దాని ఉపరితల ఉష్ణోగ్రత 2 వేల కెల్విన్‌ల వరకూ ఉంటోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Universe: సుదూర విశ్వంలో సరికొత్త గ్రహం! నక్షత్రానికి చేరువగా పరిభ్రమిస్తున్నట్లు గుర్తించిన భారత శాస్త్రవేత్తలు"

Post a Comment