ఐఆర్‌ 27 శాతమే ఫిట్‌మెంట్‌గా ఫిక్స్‌!



జేఎస్సీ భేటీలో సీఎస్‌ సంకేతాలు!?


విస్తుపోయిన ఉద్యోగ సంఘాల నేతలు


తూతూ మంత్రంగానే సాగిన సమావేశం



దేనిపైనా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం


ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలన్న సీఎస్‌


సర్కారు వైఖరిపై ఉద్యోగ నేతల అసంతృప్తి


వారం, పది రోజుల్లో స్పష్టత ఇవ్వకుంటే కార్యాచరణ 


ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నేతల హెచ్చరిక 

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘మంచి ఫిట్‌మెంట్‌’తో వేతన సవరణ వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు ‘షాక్‌’ ఇవ్వనుందా? ‘జీతం పెరిగే సంగతి పక్కనపెట్టండి. తగ్గకుండా చూడండి’ అని ఉద్యోగులు సర్కారును వేడుకునే పరిస్థితి రానుందా? శుక్రవారం జరిగిన ‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌’ సమావేశంలో ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి సంకేతాలే వెలువడ్డాయి. ‘ఫిట్‌మెంట్‌ 23 శాతం మాత్రమే ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. ఇప్పటికే ఇస్తున్న ఐఆర్‌ 27 శాతాన్నే ఫిట్‌మెంట్‌గా ఖరారు చేస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ చెప్పినట్లు తెలిసింది. దీంతో... ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయ్యారు. పీఆర్సీ పెండింగ్‌లో ఉండగా... తాత్కాలిక ఉపశమనం కోసం ఐఆర్‌ ఇస్తారు. పీఆర్సీ దానికంటే ఎక్కువే ఉండాలి. కానీ... ఐఆర్‌నే ఫిట్‌మెంట్‌గా ఖాయం చేస్తామనడం ఎంతమాత్రం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘దసరా కానుకగా పీఆర్సీ, ఈ నెలాఖరులోపు పీఆర్సీ’ అంటూ ఊరించిన సర్కారు... జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎస్సీ) సమావేశంలో తుస్సుమనిపించింది. ఈ సమావేశంలో ఏ అంశాలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పైగా... పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు పంపింది. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆధ్వర్యంలో జేఎస్సీ సమావేశం జరిగింది. ఈ భేటీలో గుర్తింపు పొందిన 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలపై సమావేశంలో ఉద్యోగ సంఘాలు గట్టిగానే నిలదీసినట్లు తెలిసింది. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండానే దీనిపై ఎలా మాట్లాడతామని నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... ‘‘పీఆర్సీ సిఫారసులను వీలైనంత త్వరలో అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చేవారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై చర్చిస్తాం. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు’’ అని తెలిపారు. అదే సమయంలో... రెండేళ్లుగా కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. అదే సమయంలో... ఐఆర్‌గా ఇచ్చిన 27 శాతాన్నే ఫిట్‌మెంట్‌ చేస్తామనే సంకేతాలు పంపినట్లు తెలిసింది. త్వరలో పీఆర్సీ అమలు చేస్తామని.. నివేదిక సారాంశాన్ని వారంలోగా అందిస్తామని సీఎస్‌ చెప్పారు. ఇక... కాంట్రాక్టు ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్‌ హెఆర్‌ ముఖ్య కార్యదర్శితో ఒక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సీపీఎస్‌ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని.. ఈ విషయంపై సీఎం జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది  ప్రాథమిక సమావేశం మాత్రమే. మరోసారి భేటీ అవుదాం. మీ డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’’ అని సమీర్‌ శర్మ హామీ ఇచ్చారు.

ఉద్యోగ సంఘాల అసంతృప్తి


ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఒక్క అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఉద్యోగ సంఘాల నేతలు నిట్టూర్చారు. 11వ పీఆర్సీ కమిషన్‌ వేతన సవరణ నివేదికలోనిదంటూ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పేజీ నోట్‌ ఆ నివేదికలోని కాదని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులకు ఐఆర్‌ ఇవ్వడం వల్ల ఎంత ఖర్చయిందో అందులో తెలిపారు. నివేదిక సిద్ధం చేసిన అశుతోశ్‌ మిశ్రా ముందే ఊహించి ఐఆర్‌పై అక్టోబరు వరకు ఎంత ఖర్చయిందో ఎలా చెబుతారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు... సీపీఎస్‌ రద్దుకు సీఎం కట్టుబడి ఉన్నారని, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పడంపైనా ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

కంటితుడుపు సమావేశం: ఉద్యోగ సంఘాలు 


పీఆర్సీపై వారం, పదిరోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి వారు విలేకరులతో మాట్లాడారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఏ అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి, అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దుపై తేల్చాలని, మిగిలిన ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలు వేటిపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారని అందుకే సమావేశాన్ని బహిష్కరించలేదన్నారు. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... 11వ పీఆర్సీపై స్పష్టత లేదన్నారు.. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక కాపీ ఇచ్చిన తర్వాతే మాట్లాడతామని చెప్పామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, సౌకర్యాలపై, ఆర్థికపరమైన నిర్ణయాలపై సమావేశంలో ఒక నిర్ణయానికి రానందున మీడియా ముందుకు రావడంలేదని ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఐఆర్‌ 27 శాతమే ఫిట్‌మెంట్‌గా ఫిక్స్‌!"

Post a Comment