Covaxin for Children: చిన్నారులకు కొవాగ్జిన్.. ప్రయోగాలు పూర్తి! త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం
హైదరాబాద్: 18ఏళ్లలోపు పిల్లల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి రానున్నట్లు
తెలుస్తోంది. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన ‘కొవాగ్జిన్’ తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు పూర్తి చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రయోగాల సమాచారాన్ని వచ్చే వారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేస్తామని ప్రకటించింది. ఇక ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ అంచనా వేసింది.
‘18ఏళ్లలోపు చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్ 2/3 దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సమాచార విశ్లేషణ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని డీసీజీఐకి వచ్చే వారం అందజేస్తాం. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించాం’ అని హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న (18ఏళ్ల పైబడిన వారికి) కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచామన్న ఆయన.. సెప్టెంబర్ నెలలో 3.5కోట్ల డోసులను ఉత్పత్తి చేశామన్నారు. అక్టోబర్‌లో వీటి సంఖ్య 5.5కోట్లకు కచ్చితంగా పెరుగుతుందని చెప్పారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ ఉత్పత్తి చేసేందుకు ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, హెస్టర్ బయోసైన్సెస్‌తో భారత్ బయోటెక్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయాన్ని కృష్ణ ఎల్లా గుర్తుచేశారు
0 Response to "Covaxin for Children: చిన్నారులకు కొవాగ్జిన్.. ప్రయోగాలు పూర్తి! త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం"
Post a Comment