Schools reopen: ఆ రాష్ట్రాల్లో మోగిన బడిగంట.. పలుచగానే విద్యార్థుల హాజరు మూడో ఉద్ధృతి హెచ్చరికల నేపథ్యంలో తల్లిదండ్రుల ఆందోళన

ఛత్తీస్‌గఢ్, రాయ్‌పుర్‌: సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని పాఠశాలలు సోమవారం తెరచుకున్నాయి. 50% మంది విద్యార్థులనే అనుమతించి, కొవిడ్‌-19 నియమావళిని అనుసరించి తరగతులు నిర్వహించారు. 

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అధిక సంఖ్యలో తరగతులకు హాజరు కాగా, పట్టణాల్లో గరిష్ఠంగా 30% హాజరు మాత్రమే నమోదైంది. మళ్లీ బడులు తెరచుకోవడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం; కరోనా మూడో ఉద్ధృతి పొంచి ఉందని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో... బడులు తెరవడం పట్ల చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం 12వ తరగతి/ఇంటర్‌ విద్యార్థులను బడులకు అనుమతించారు. రోజూ 50% మందే తరగతులకు హాజరు కావాలి. ప్రతి విద్యార్థి రోజు విడిచి రోజు బడికి వెళ్లొచ్చు. జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు ఉన్నవారు మాత్రం ఇళ్ల వద్దే ఉండాలి. ‘‘పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం 30% హాజరే నమోదైంది. గ్రామాల్లో విద్యార్థుల హాజరు సంతృప్తికరంగా ఉంది. మంగళవారం నుంచి పదో తరగతి వారికి బోధన ప్రారంభమవుతుంది’’ అని ఛత్తీస్‌గఢ్‌ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు రాజీవ్‌ గుప్తా తెలిపారు. బడులను తెరుస్తూ ప్రభుత్వం నిర్ణయించడాన్ని రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు క్రిస్టఫర్‌ తప్పుపట్టారు. మూడో ఉద్ధృతి హెచ్చరికల నేపథ్యంలో మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందన్నారు. 1 నుంచి 5, 8వ తరగతి విద్యార్థులకు బోధించేందుకూ ప్రభుత్వం బడులను అనుమతించింది. ఇందుకు గ్రామ పంచాయతీ/కార్పొరేటర్‌తో పాటు పేరెంట్స్‌ కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని నిర్దేశించింది. కొవిడ్‌ రెండో ఉద్ధృతి నేపథ్యంలో- గత ఏడాదే బడులు మూతపడ్డాయి. కేసులు తగ్గిన క్రమంలో 9-12 తరగతుల వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బోధన ఆరంభించినా, రెండో ఉద్ధృతి క్రమంలో మార్చిలోనే పాఠశాలలు మళ్లీ మూతపడ్డాయి.


పంజాబ్‌లో అన్ని తరగతులకూ

పంజాబ్‌లో అన్ని తరగతుల వారికి సోమవారం నుంచి పాఠశాలల్లో బోధన పునఃప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధిక సంఖ్యలో తరగతులకు హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో జులై 26 నుంచే 10, 11, 12 తరగతుల వారికి క్లాసులు జరుగుతున్నాయి. మిగతా వారికి సోమవారం నుంచి ఆరంభమయ్యాయి. దృశ్య మాధ్యమంలోనూ తరగతులు కొనసాగుతాయి.


ఉత్తర్‌ప్రదేశ్‌లో 16 నుంచి..

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి బడులు తెరచుకోనున్నాయి. ప్రస్తుతానికి 9, 10 తరగతుల వారికి, ఇంటర్‌ విద్యార్థులకు మాత్రమే పాఠాలు బోధిస్తారు. మరోవైపు- ఉన్నత విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి తెరిచేందుకు ప్రభుత్వం సోమవారం అనుమతించింది. విద్యా సంస్థల్లో కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని  సీఎం ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Schools reopen: ఆ రాష్ట్రాల్లో మోగిన బడిగంట.. పలుచగానే విద్యార్థుల హాజరు మూడో ఉద్ధృతి హెచ్చరికల నేపథ్యంలో తల్లిదండ్రుల ఆందోళన"

Post a Comment