రాత్రంతా ఛార్జింగ్ పెట్టినా.. ఇబ్బంది లేదు! ఫోన్ బ్యాటరీపై అపోహలు వద్దు
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకపోతే క్షణం గడవదు. అందుకే ఫోన్ బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఫోన్ కొనే సమయంలో కెమెరా, ప్రాసెసర్, స్ర్కీన్ సైజ్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మిగతా ఫీచర్లు కొంచెం తక్కువైనా బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ ఉన్న ఫోన్‌నే తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. చాలా మందికి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీల వినియోగంపై చాలా సందేహాలు, అపోహలుంటాయి. వాటిలో నిజానిజాలేంటో ఓసారి తెలుసుకుందాం.
ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీ పాడవదు
సాధారణ ఛార్జర్‌లో నుంచి 5నుంచి 10 వాట్ల విద్యుత్ అవుట్‌పుట్ వస్తుంది. ఒక ఫాస్ట్ ఛార్జర్ సామర్థ్యం సుమారు దీనికి ఎనిమిదింతల వరకు ఉంటుంది. ఐఫోన్ 11ప్రో, ప్రో మ్యాక్స్ 18 వాట్ల ఛార్జర్‌తో వస్తోంది. గెలాక్సీ నోట్ 10, 10ప్లస్ 25 వాట్ల ఛార్జర్‌తో వస్తోంది. సామ్‌సంగ్ 50డాలర్లకు 45వాట్ ఛార్జర్ అందిస్తోంది. ఇంత అవుట్‌పుట్ వచ్చినా ఫాస్ట్ ఛార్జర్లు ఫోన్ బ్యాటరీని పాడు చేయవు. ఫాస్ట్ ఛార్జర్ సాంకేతికతలో రెండు దశల్లో ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. మొదటి 10 నుంచి 30 నిమిషాల్లో 50 నుంచి 70 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. మొదటి దశలో బ్యాటరీ ఏ ఇబ్బందులు లేకుండా ఛార్జింగ్‌ను తీసుకుంటుంది. అందుకే ఇంత వేగంగా ప్రక్రియ జరిగేలా చూస్తారు. సామ్‌సంగ్ తన 45వాట్ ఛార్జర్‌తో అరగంటలో 70శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఐఫోన్ 11 ప్రోతో వచ్చే ఫాస్ట్ ఛార్జర్‌తో 50శాతం ఛార్జింగ్‌ని 30నిమిషాల్లో చేయవచ్చు. కానీ ఫాస్ట్ ఛార్జర్‌లు చివరి 20-30శాతం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫోన్ తయారీదారులు రెండో దశలో ఛార్జింగ్ స్పీడ్‌ని తగ్గించడం ద్వారా హైవోల్టేజీతో బ్యాటరీని దెబ్బతినకుండా చూస్తారు.
ఫోన్ బ్యాటరీని ఓవర్ ఛార్జ్ చేయలేం
చాలామంది రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్‌కు ఛార్జింగ్ పెడతారు. ఇలా పెట్టి ఉదయం తీయడం వల్ల ఓవర్ ఛార్జ్ అయ్యే సమస్య వస్తుందా అని తోటి వారిని అడుగుతుంటారు. ఫోన్ పేలిపోతుందా, మంటలు వస్తాయా అని సందేహించే వారూ ఉంటారు. అయితే ఇది అవాస్తవం. బ్యాటరీ ఎప్పటికీ ఓవర్‌ఛార్జింగ్ కాదు. బ్యాటరీలను డిజైన్ చేసే నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకసారి 100శాతం ఛార్జ్ అయ్యాక ఎలక్ట్రికల్ ఛార్జింగ్ నిలిపే విధంగా ఫోన్‌లలో నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల ఓవర్ ఛార్జింగ్ అనే సమస్యకు అవకాశమే ఉండదు. కానీ 100శాతం ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణం వల్లే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు కొత్త బ్యాటరీలను 80శాతం వరకే ఛార్జింగ్ చేస్తారు. యాపిల్ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఓస్13లో మార్పులు చేసింది. దీని ద్వారా వినియోగదారుడు కోరుకుంటే ఫోన్‌లో 80శాతం ఛార్జింగ్ కాగానే ఆపే విధంగా మార్పులు చేసింది. ఇలా కాకుండా సాధారణంగా కూడా 80శాతం ఛార్జింగ్ కాగానే ఆపేయడంతో బ్యాటరీ మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది
ఛార్జింగ్‌ను సున్నాకు తీసకురాలేం
సాధారణంగా బ్యాటరీల్లో నుంచి పూర్తిగా ఛార్జింగ్ తీసేయడం సమస్యలకు దారి తీస్తుంది. కానీ ఇప్పుడున్న అధునాతన ఫోన్ బ్యాటరీలకు ఆ సమస్య లేదు. నిజానికి బ్యాటరీల్లో ఛార్జింగ్ పూర్తిగా తీసేయడం వల్ల దాంట్లో రసాయన చర్యలు జరిగి బ్యాటరీ జీవిత కాలం తగ్గే అవకాశాలుంటాయి. అందుకే ఫోన్ బ్యాటరీ వ్యవస్థలు నిజానికి సున్నా ఛార్జింగ్‌కు పడిపోకముందే స్విచ్ ఆఫ్ అవుతుంటాయి. దీంతో ఫోన్ బ్యాటరీ భద్రంగా ఉంటుంది. ఇంకా మీరు బ్యాటరీ జీవిత కాలం పెంచాలనుకుంటే దాని బ్యాటరీ శాతం 30కి తగ్గకముందే ఛార్జ్ చేయడం మంచిది.
అధిక ఉష్ణోగ్రతలతో నష్టమే
అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి బ్యాటరీ జీవిత కాలాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల ఫోన్‌ను అధిక ఉష్ణోగ్రతలు, ఎండ నుంచి దూరంగా ఉంచాలి. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ అధిక ఉష్ణోగ్రతలతో పేలే అవకాశం ఉంటుంది. బ్యాటరీ సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 80డిగ్రీల ఫారన్‌హీట్(30డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత దాటితే బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది
పాడైన ఛార్జర్లు కాకుండా సరిగ్గా ఉన్న ఛార్జర్లు, కేబుల్స్ వేరే కంపెనీకి చెందినవి వినియోగించినా మొబైల్ బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉండదు. కానీ వేరే కంపెనీ ఛార్జర్‌లను వినియోగించినప్పుడు ఫోన్ అంత త్వరగా ఛార్జ్ అయ్యే అవకాశం ఉండదు. హువాయ్, వన్‌ప్లస్ లాంటి మొబైల్‌లు ప్రత్యేకమైన ర్యాపిడ్ ఛార్జింగ్ విధానాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలంటే ఆ కంపెనీ ఛార్జర్‌నే వినియోగించాల్సి ఉంటుంది. మరోవైపు సామ్‌సంగ్, యాపిల్ లాంటి ఫోన్లు వివిధ రకాల ఛార్జర్లు, కేబుల్స్‌తో పని చేస్తాయి. ఛార్జింగ్ వేగంగా కావాలంటే మొబైల్ కంపెనీకి చెందిన ఛార్జర్‌ను వినియోగించడం మంచిది.
బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ ఉంటే మంచిది
అన్ని
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీని
వినియోగిస్తారు. బ్యాటరీల జీవితకాలం ఎక్కువ కాలం ఉండేలా తయారు చేయడం
కఠినమైన విషయం. ఎందుకంటే దశాబ్దాలుగా బ్యాటరీలను తయారు చేసే పద్ధతుల్లో
పెద్దగా మార్పు రావడం లేదు. కానీ ఇప్పుడు వచ్చే గ్యాడ్జెట్లలో వస్తున్న
సాఫ్ట్‌వేర్, సాంకేతికతతో బ్యాటరీల జీవితకాలం పెరిగింది. బ్యాటరీల శక్తిని
మిల్లీ ఆంపియర్ అవర్స్(mah)లలో కొలుస్తుంటారు. పిక్సెల్4లో 2,800
ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ 3,969ఎంఏహెచ్ బ్యాటరీ
ఉంటుంది. ఫోన్‌కు పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల బ్యాటరీ జీవిత కాలం
పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీని ఛార్జింగ్ చేసినప్పుడు
సాధారణంగానే వోల్టేజ్ పెరిగి బ్యాటరీపై ఒత్తిడి ఏర్పడుతుంది. 80శాతం
ఛార్జింగ్ తరువాత చివరి 20 శాతం ఛార్జింగ్ కావాల్సి ఉన్నప్పుడు ఈ ఒత్తిడి
మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎలక్రానిక్ కార్లు తయారుచేసే వారు కొత్త
బ్యాటరీలను 80శాతం వరకే ఛార్జింగ్ చేస్తారు. దీంతో బ్యాటరీ జీవితకాలం
రెండింతలు పెరుగుతుంది. అందుకే పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లో 80శాతం
ఛార్జింగ్ చేసి దాని జీవితకాలాన్ని పెంచవచ్చు. తక్కువ బ్యాటరీ సామర్థ్యం
ఉన్న ఫోన్‌లో ఇలా చేస్తే మనకు రోజంతా ఛార్జింగ్ సరిపోకపోవచ్చు. ఫోన్
డిస్‌ప్లే బ్రైట్‌నెస్ తగ్గించడం, వైఫై, బ్లూటూత్ ఆఫ్ చేయడం,
సెట్టింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగాన్ని తగ్గించడం ద్వారా
ఛార్జింగ్ ఎక్కువ కాలం వచ్చేలా చూసుకోవచ్చు
0 Response to " రాత్రంతా ఛార్జింగ్ పెట్టినా.. ఇబ్బంది లేదు! ఫోన్ బ్యాటరీపై అపోహలు వద్దు"
Post a Comment