ఫోన్‌ బ్యాటరీ జీవితకాలం పెరగాలా..? ఇవిగో చిట్కాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది. ఫోన్‌లో మాట్లాడటం, పేమెంట్స్‌, మెసేజ్‌లు, వీడియోలు.. అంటూ స్మార్ట్‌ఫోన్‌ నిరంతరం బిజీగానే ఉంటోంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఛార్జింగ్‌ పెట్టుకుంటూ ఉండటం, బ్యాటరీ బ్యాకప్‌లను వెంటపెట్టుకోని వెళ్లడం ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుకుంటే మంచిది. ఎప్పుడూ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తూ ఉన్నా సరే బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది. ఉన్న బ్యాటరీనే ఎక్కువ సమయం రావాలంటే మాత్రం ఇలాంటి చిట్కాలను ఫాలో అయిపోతే సరి..!

బ్లూటూత్, లోకేషన్‌ ఆపేయండి




స్మార్ట్‌ఫోన్‌లో అవసరం లేనప్పుడు బ్లూటూత్‌ కనెక్షన్‌, జీపీఎస్‌ వంటి వాటిని ఆపేయండి. బ్యాటరీ ఎక్కువగా వాడుకునే వాటిలో జీపీఎస్‌ ఒకటి. అందుకే జీపీఎస్‌తో పని లేనప్పుడు దానిని ఆపేసుకుంటే మంచిది. జీపీఎస్‌, బ్లూటూత్‌ కనెక్షన్‌ కావాలనుకున్నప్పుడు చాలా తేలికగానే ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు స్మార్ట్‌ఫోన్లలో ఉంటుంది. మరి అలాంటప్పుడు అనవసరంగా ఉండే వాటిని కట్టేస్తేనే బ్యాటరీ లైఫ్‌ ఎక్కువ కాలం వస్తుంది.

ఫోన్‌ బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవడం ద్వారా..

స్మార్ట్‌ఫోన్లలో అతి కీలకమైన భాగాల్లో డిస్‌ప్లే ఒకటి. వెలుతురు బాగా ఉన్న సమయంలో డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల బ్యాటరీ వినియోగం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవడం ఉత్తమం. బ్రైట్‌నెస్‌ను ఎంత తక్కువగా పెట్టుకుంటే బ్యాటరీని అంత సేవ్‌ చేసే వీలవుతుంది. కాబట్టి వీడియోను, మెసేజ్‌ను చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడే బ్రైట్‌నెస్‌ను కాస్త పెంచుకుంటే సరిపోతుంది. ఎక్కువగా బ్రైట్‌నెస్‌ను వాడటం వల్ల కళ్లపై కూడా ప్రభావం చూపే ఆస్కారముంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌ను పూర్తిగా తీసేయండి


వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇతర యాప్స్‌ను ఓపెన్‌ చేసి చూసుకోవడం సాధారణ విషయమే. అయితే యాప్‌ వాడకం అయిపోయిన తర్వాత దానిని పూర్తిగా తీసేయడం మంచిది. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండటం వల్ల బ్యాటరీతోపాటు ప్రాసెసర్‌పై ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాంతో బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోయే ప్రమాదం ఉంది. యాప్స్‌ను వాడిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లోనూ యాప్స్‌ను తొలగించడం ద్వారా బ్యాటరీ జీవిత కాలాన్ని కాపాడుకోవచ్చు.

'ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే'ను ఆఫ్‌ చేసేద్దాం..

స్మార్ట్‌ఫోన్‌ను వాడకుండా ఉన్నప్పుడు తేదీ, సమయం, నోటిఫికేషన్లు కనిపించేందుకు ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్‌ ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇది కూడా బ్యాటరీ లైఫ్‌ను తగ్గించే అవకాశం ఉన్నట్లు టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. డిస్‌ప్లే ఆన్‌లో ఉండటం వల్ల దానికీ బ్యాటరీ వినియోగం అవుతుంది. కాబట్టి ఈ ఫీచర్‌ను ఆపేసుకుంటే బ్యాటరీను సేవ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే' ఆప్షన్‌ను టర్న్‌ఆఫ్‌ చేసుకుంటే సరిపోతుంది.

లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ వాడొద్దు..

స్మార్ట్‌ఫోన్లో వివిధ రకాల వాల్‌పేపర్స్‌ అందుబాటులో ఉంటాయి. లాక్‌ స్క్రీన్‌కు, హోం స్క్రీన్‌కు ఒకేసారి, వేర్వేరుగా కూడా పెట్టుకునే అవకాశం ఉంది. అయితే లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ను వాడకపోవడం ఎంతో ఉత్తమం. యానిమేటెడ్‌, గ్రాఫిక్స్‌తో రూపొందించిన లైవ్‌ వాల్‌పేపర్స్‌ను సెట్‌ చేసుకుంటే బ్యాటరీ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోన్‌లో ఆఫ్‌లో ఉన్నా సరే బ్యాటరీ వాడకం మాత్రం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ను పెట్టుకోవద్దని నిపుణులు సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫోన్‌ బ్యాటరీ జీవితకాలం పెరగాలా..? ఇవిగో చిట్కాలు"

Post a Comment