హోంఆంధ్రప్రదేశ్ బాల్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
చట్టాన్ని విభేదించే పిల్లల్ని బాధితుల్లానే చూడాలి : హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి
నవంబరు 14లోపు ‘బాలమిత్ర’: డీజీపీ
జువెనైల్ జస్టిస్ యాక్ట్ అమలుపై వెబినార్
అమరావతి, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): ‘బాల్యం ఎంతో విలువైనది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటితరం మనల్ని క్షమించదు.. అనాథ బాలల్ని వీలైనంత త్వరగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలి’ అని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్-2015 అమలు విధానం, అమలులో సంబంధిత శాఖల మధ్య అంతరాన్ని గుర్తించి పరిష్కరించడంపై పోలీసుశాఖ గురువారం ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ మహేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అనాథలైనా, చట్టంతో విభేదించిన బాల బాలికలైనా బాధితులేనని, వారిని నిందితులుగా చూడొద్దన్నారు. ఊహ తెలియక ముందే దత్తత ఇస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బాల్యం గురించి మండేలా, అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులను చీఫ్ జస్టిస్ చదివి వివరించారు. రాష్ట్రంలో ‘బాలమిత్ర’ కార్యక్రమాన్ని నవంబరు 14 లోపు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. జువెనైల్ జస్టిస్ అమలు కోసం వ్యవస్థీకృత మార్పులు తేవడానికి పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. మహిళల రక్షణ కోసం ‘మహిళా మిత్ర’ అమలు చేస్తున్నామని, బాలల రక్షణకు సైతం శాశ్వత చర్యలు చేపట్టబోతున్నామన్నారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ విజయలక్ష్మి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ, డైరెక్టర్ కృతికా శుక్లా, జువెనైల్ బోర్డు, జిల్లా లీగల్ అథారిటీ అధికారులు, బాలికా సంరక్షణ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు
0 Response to " హోంఆంధ్రప్రదేశ్ బాల్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు "
Post a Comment