బరితెగింపు బదిలీలు

వంద మందికిపైగా టీచర్ల బదిలీకి ఆర్డర్లు

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యాక ప్రభుత్వం అసాధారణ చర్య

ఇన్నాళ్లూ పైరవీలకు స్పెషల్‌ బదిలీలు.. షెడ్యూల్‌ తర్వాతా అదే వరుస

కావాల్సినవారికి చాన్స్‌.. కోరుకున్న చోటుకు పంపుతూ మెమోలు 

విచక్షణాధికారం పేరిట శ్రుతిమించిన జగన్‌ సర్కారు తీరు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 12న విడుదల చేసింది. ఆ తరువాత రెండు రోజులకే షెడ్యూల్‌ కూడా విడుదల అయింది. కొన్నేళ్లుగా కళ్లు కాయలు కాసేలా బదిలీల కోసం ఎదురుచూసిన లక్షకుపైగా టీచర్లు ఈ నిర్ణయాలతో సంతోషించారు. ఇంతలోనే.. 100 మందికి పైగా టీచర్ల బదిలీకి ఆర్డర్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలు.. వారిపై పిడుగులా పడ్డాయి. ఒకసారి కౌన్సెలింగ్‌ మార్గదర్శకాలు, షెడ్యూల్‌ విడుదలైన తర్వాత గతంలో ఎన్నడూ ఇలా సర్కారు బదిలీ ఆర్డర్లు రాలేదని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వ విచక్షణాధికారంతో చేపట్టే బదిలీలు ఆగిపోతాయనీ, కౌన్సిలింగ్‌ పద్ధతితో తప్పక తమకు న్యాయం జరుగుతుందనీ అర్హులైన టీచర్లంతా ఆశించారు. ఈ అసాధారణ పరిణామాలతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.


టీడీపీ ప్రభుత్వం 2017లో చివరిసారిగా టీచర్ల బదిలీలు చేపట్టింది. వైఎస్‌. జగన్‌ ప్రభుత్వం వచ్చి 16 నెలలు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌ ద్వారా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టలేదు. అదే సమయంలో అధికార పార్టీ నేతల సిఫారసులతో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు విచక్షణాధికార బదిలీ ఆర్డర్లు ఇస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో (సంక్రాంతి) టీచర్ల బదిలీలు చేపడతామని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించినా అతీగతీ లేదు. సుదీర్ఘ కాలయాపన అనంతరం, ఎట్టకేలకూ బదిలీలకు సీఎం జగన్‌ ఈ నెల 10న గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. తదుపరి కార్యాచరణ ప్రకటించారు. అయినా సరే ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు ఆగటం లేదు .. గత ఏడాది కాలంగా నిరంతరాయంగా వస్తున్న ‘ఆర్డర్ల’ పర్వం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. 


జీవోలుండవు.. మెమోలతో మమ..

రూల్స్‌కి విరుద్ధంగా సర్కారు నేరుగా చేసే ఈ బదిలీలకు జీవోలు మాత్రం విడుదల చేయరు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మెమోలు ఇస్తున్నారు. పారదర్శకత లేకుండా దొడ్డిదారి పర్వం నడుస్తూనే ఉంది. నిజంగా బదిలీ అవసరమైన వారి దరఖాస్తులు కోల్డ్‌ స్టోరేజి లోకి వెళ్తున్నాయి. ఉన్నత స్థాయిలో పలుకుబడి ఉన్న వారికి, పైరవీలు చేసుకునే స్థాయి ఉన్న వారికి మాత్రమే ఈ తరహా బదిలీలు జరుగుతున్నాయి. మండల పరిధిలోనే కాకుండా పరస్పర బదిలీలు అంతర్‌జిల్లా బదిలీలు సైతం జరుగుతున్నాయి. రిటైర్మెంట్‌ కారణంగా ఏర్పడే ఖాళీలు, 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రదేశాలు, నగరాలు/పట్టణాలకు సమీపంలో ఉండే స్కూళ్లకు సిఫారసుల బదిలీలు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.


మంత్రులు, ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు తమకు కావాల్సిన టీచర్ల బదిలీలకు సిఫారసులు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలపై కొనసాగుతోన్న నిషేధాన్ని సడలిస్తూ ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఈ బదిలీల పర్వం నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వందల సంఖ్యలో బదిలీల మోమోలు విడుదల కాగా , మరికొన్ని వందల మంది బదిలీలు ప్రాసె్‌సలో ఉన్నట్లు తెలుస్తోంది. స ర్కారీ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో దీర్ఘకాలంగా భార్యాభర్తలు సు దూర ప్రాంతాల్లో పనిచేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది టీచర్లకు ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు ఎప్పుడో పూర్తయింది. రిక్వెస్ట్‌ బదిలీలు ఆశించే టీచర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 


రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బరితెగించింది. బదిలీలను చేపట్టడానికి మార్గదర్శకాలను, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తానే ప్రకటించి..  తనకు ‘కావాల్సిన వారి’కోసం తిరిగి తానే అడ్డదారి తొక్కింది. ఒకేసారి ఏకంగా వందమంది టీచర్ల బదిలీకి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఆర్డర్లు ఇచ్చేశారు. షెడ్యూల్‌ అమల్లో లేని నిషేధ కాలంలో, అత్యవసరం అని ప్రభుత్వం భావించినప్పుడు.. తన విచక్షణాధికారాన్ని వాడి స్పెషల్‌ బదిలీలు చేపట్టడం ఎప్పుడూ జరిగేదే. అయితే, కౌన్సెలింగ్‌కు తేదీలను ప్రకటించిన తరువాత కూడా, ఈ అధికారాన్ని ప్రయోగించడం కచ్చితంగా ‘బరితెగింపే’నని ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహిస్తున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బరితెగింపు బదిలీలు"

Post a Comment