నచ్చిన చానల్ ఎంపిక మరింత సులభం
- అనవసర చానళ్లను తొలగించుకోవచ్చు
- నెలవారీ బిల్లుల భారమూ తక్కువే!
- ‘చానల్ సెలెక్టర్’ యాప్‌ను విడుదల చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ, జూన్ 28: కేబుల్ టీవీ లేదా డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) కస్టమర్లకు మరింత ప్రయోజనం కలిగేలా భారత టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవలే ‘చానల్ సెలెక్టర్’ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ వినియోగంతో కస్టమర్లు తమకు నచ్చిన చానళ్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అవసరం లేని చానళ్లను తొలగించుకోవచ్చు. మంచి ధరల్లో దొరికే కాంబినేషన్ చానళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఫలితంగా కస్టమర్లకు నెలవారీ బిల్లుల భారం తగ్గే అవకాశం ఉంటుందని ట్రాయ్ చెబుతోంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లకు, యాప్ స్టోర్ ద్వారా యాపిల్ ఐఫోన్ల కస్టమర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది.
యాప్ వినియోగం ఇలా...
చానల్ సెలెక్టర్‌ను వినియోగించుకోవాలనుకుంటే ముందు ఈ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా కస్టమర్లు తమ టీవీ సబ్‌స్ర్కిప్షన్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌లో టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, హాత్‌వే డిజిటల్, సిటీ నెట్‌వర్క్, ఏషియన్ నెట్, ఇన్‌డిజిటల్‌వంటి ఎంఎ్‌సఓ కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థలను డిస్ర్టిబ్యూటెడ్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లు (డీపీఓ) అంటారు. డీపీఓలు ఆఫర్ చేసే టీవీ చానళ్లు లేదా బొటిక్స్‌ను ఈ యాప్ ద్వారా కస్టమర్లు చాలా సులభంగా ఎంచుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే మీ ఆపరేటర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సెట్‌టాప్ బాక్స్‌కు సంబంధించిన నెంబర్, సబ్‌స్ర్కైబర్ ఐడీ వివరాలతోపాటు మీ ఆపరేటర్ దగ్గర రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్ చేయగానే మీ సబ్‌స్ర్కిప్షన్ వివరాలు కనిపిస్తాయి. అప్పుడు మీకు అవసరమైన ప్యాక్‌లలో మార్చులు చేర్పులు చేసుకోవచ్చు. మీ కేబుల్ టీవీ లేదా డీటీహెచ్ ఆపరేటర్ అందించే చానళ్ల వివరాలు, వాటి ధర కూడా యాప్‌లో అందుబాటులో ఉంటుంది. వాటిలో అవసరమైన వాటిని ఎంచుకోవచ్చు. అనవసరం అనుకుంటే తొలగించుకోవచ్చు.
నెలవారీ బిల్లును తగ్గించుకునే విధంగా ఈ యాప్ ద్వారా తగిన సూచనలు పొందవచ్చు. ఇప్పటికే డీపీఓలు తమ సొంత యాప్‌లు లేదా పోర్టళ్ల ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. అయితే వీటి ద్వారా కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ట్రాయ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో తన యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ యాప్ ద్వారా టీవీ వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన, పారదర్శకమైన వ్యవస్థలను అందించే అవకాశం ఏర్పడుతుందని ట్రాయ్ చెబుతోంది
0 Response to "నచ్చిన చానల్ ఎంపిక మరింత సులభం"
Post a Comment