తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి తితిదే సిబ్బంది, స్థానికులతో తొలుత ప్రయోగం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున గత రెండు నెలలకుపైగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే.





 తాజాగా 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయోగాత్మక దర్శనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మే 12న తితిదే ఈవో రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ దర్శనాలకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 



అయితే ప్రస్తుతం భక్తులందరినీ దర్శనాలకు అనుమతించకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తితిదే పేర్కొంది. అయితే సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి ఎప్పటినుంచి అనుమతిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సిఉంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మక దర్శనాలను ప్రారంభించనున్నట్లు తితిదే వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తితిదేకు సూచించిన నేపథ్యంలో గంటకు 300 మందికి మాత్రమే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే స్పష్టం చేసింది. 



రోజుకు 15 గంటలపాటు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తితిదే వివరించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి తితిదే సిబ్బంది, స్థానికులతో తొలుత ప్రయోగం"

Post a Comment