తెలంగాణలో జూన్7 వరకు లాక్‌డౌన్ అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని సడలింపు..
తెలంగాణలో జూన్7 వరకు లాక్‌డౌన్
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని సడలింపు..
హైదరాబాద్: తెలంగాణలో కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు జూన్ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆస్పత్రులు, ఔషధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ యథాతథంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, నిన్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ మూడు దశల కార్యాచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్ 5.0 మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి
కంటెయిన్‌మెంట్ జోన్లలో అత్యవసర పనులకే అవకాశం
కంటెయిన్‌మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలనే అనుమతించాలి. అవి మినహాయించి ఇక్కడి ప్రజలు బయటకు రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇక్కడ కాంటాక్ట్ ట్రేసింగ్ కార్యక్రమాలను ఉద్ధృతంగా చేపట్టాలి. ప్రతి ఇంటిపై నిఘా ఉంచాలి. వైద్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
* కంటెయిన్‌మెంట్ జోన్ల బయట కొత్త కేసులు రావడానికి అవకాశమున్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలు బఫర్ జోన్లుగా గుర్తించవచ్చు. అవసరం అనుకున్న ఆంక్షలను జిల్లా అధికారులు విధించొచ్చు.
* కంటెయిన్‌మెంట్ జోన్ల బయట కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కార్యకలాపాలను నిషేధించడంతో పాటు, తాము అవసరమని భావించిన ఆంక్షలు విధించుకోవచ్చు.
రాష్ట్రాల మధ్య రాకపోకలకు పచ్చజెండా
అంతర్రాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోంశాఖ ఎత్తేసింది. ఇకమీదట వేర్వేరు రాష్ట్రాలు/ జిల్లాల మధ్య వ్యక్తుల, సరకుల రాకపోకలపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించడానికి వీల్లేదు. ప్రత్యేక అనుమతులు, ఈ-పర్మిట్లు అవసరం లేదు.
* ఏ రాష్ట్రమైనా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించాలనుకుంటే దాని గురించి ముందుగానే విస్తృత ప్రచారం చేయాలి.
* ప్రయాణికుల రైళ్లు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు, విదేశాల బయట నిలిచిపోయిన భారతీయులు స్వదేశానికి రావడం, నిర్దిష్టమైన వ్యక్తులు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లడం, విదేశీయుల తరలింపు, భారతీయ నావికుల రాకపోకలు మాత్రం ప్రామాణిక పద్ధతుల ప్రకారం పరిమితంగానే కొనసాగుతాయి.
* దేశ భూ సరిహద్దుల నుంచి వచ్చే సరకు రవాణా వాహనాలను ఏ రాష్ట్రం నియంత్రించడానికి వీల్లేదు.
* 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు ఇంట్లోనే ఉండటం మంచిది. అత్యవసర, ఆరోగ్యపరమైన పనులుంటే తప్ప బయటికి రావొద్దు.
* మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లు వీటిని కఠినంగా అమలు చేయాలని కేంద్రం పేర్కొంది.
షరతులు వర్తిస్తాయి
బయటకు వచ్చే వారందరూ మాస్కులు వాడాలి. ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. దుకాణాల్లోకి ఒకసారి ఐదుగురిని మించి రానివ్వకూడదు. సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. వివాహ సంబంధ కార్యక్రమాల్లో 50 మంది, అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు. బహిరంగంగా ఉమ్మివేయడం, మద్యం సేవించడం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషిద్ధం. సాధ్యమైనంత మేరకు ఇంటి నుంచి పనిచేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. దుకాణాలు, మార్కెట్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తులు దశలవారీగా వచ్చి వెళ్లడానికి వీలు కల్పించాలి. ఉమ్మడి ప్రాంతాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. పని ప్రాంతాల్లో తరచూ వైరస్ నిర్మూలన రసాయనాలు పిచికారీ చేయాలి. పనిచేసే చోట్ల భౌతిక దూరం పాటించేలా చూసే బాధ్యత అక్కడి ఇన్‌ఛార్జిలదే

0 Response to "తెలంగాణలో జూన్7 వరకు లాక్‌డౌన్ అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని సడలింపు.."
Post a Comment