11 డిజిట్స్ నెంబరెందుకు?
ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న కాలంతో పాటే అన్ని మారుతుంటాయి. భవిష్యత్‌కు ఏం అవసరమో గుర్తించి ముందుకు సాగినప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడతాం. అలాగే టెలికాం రంగంలో కూడా ఇప్పటి వరకు విప్లవాత్మకమైన మార్పులు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ల్యాండ్ లైన్‌తో ప్రారంభమైన కమ్యూనికేషన్ సెల్‌ఫోన్ రాకతో రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాకు మించి మొబైల్ కనెక్షన్‌లు
నమోదవుతన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి పెరుగుతున్న కొత్త కనెక్షన్లకు తగ్గట్టు ఫోన్ నంబర్లను భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) అందుబాటులోకి తెస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కొత్త మొబైల్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ పదకొండు అంకెలుండే మొబైల్ నంబర్లను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు 11 డిజిట్స్ ఉండే నంబర్లను అందుబాటులోకి తేవాలని టెలికాం కంపెనీలకు తాజాగా సిఫార్సులు కూడా చేసింది. మరి ఇప్పటి వరకు 10 అంకెలున్న మొబైల్ నంబర్‌ను ఎందుకు 11 అంకెలకు పెంచుతున్నారు.. దాని వెనుక ఉన్న కథేంటో ఓ లుక్కేయండి.
అందుబాటులోకి కొత్త నంబర్లు
ట్రాయ్ తీసకువస్తున్న 11 డిజిట్స్ మొబైల్ నంబర్ ప్రతిపాదన వల్ల భారీగా కొత్త నంబర్లు పుట్టుకురానున్నాయి. ప్రస్తుతమున్న మొబైల్ నంబర్ ముందు ‘9’ని చేర్చడం ద్వారా ఈ కొత్త నంబర్లను సృష్టించబోతున్నారు. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి నంబర్ల కొరత ఉండబోదు. ఫలితంగా కమ్యూనికేషన్ నిరాటంకంగా సాగి.. టెలికాం రంగ ప్రగతికి బాటలు పడనున్నాయి. ట్రాయ్ తీసుకున్న ఈ చర్య వల్ల దాదాపు 1000 కోట్ల నూతన మొబైల్ నంబర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి 2050 వరకు అవసరమయ్యే మొబైల్ నంబర్ల కొరతను తీర్చునున్నాయి. కానీ ట్రాయ్ ప్రతిపాదనకు టెలికాం ఆపరేటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
2003 తర్వాత మళ్లీ..
ఇండియాలో మొబైల్ ఫోన్ వాడకం పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ ఇప్పటి వరకు రెండు సార్లు నంబరింగ్ ప్లాన్‌ను సవరించింది. ఆర్థిక సంస్కరణల ప్రవేశానంతరం 1993లో మొదటిసారి నంబరింగ్ ప్లాన్‌ను సమీక్షించగా.. రెండోసారి 2003లో ఈ చర్య చేపట్టింది. ట్రాయ్ అంచనాల కన్నా ఎక్కువగా మొబైల్ కనెక్షన్లు పెరుగుతుండడంతో 2003 తర్వాత మళ్లీ ప్రస్తుతం నంబరింగ్ ప్లాన్‌పై దృష్టిసారించింది. మొదట ‘9’ సిరీస్‌తో ప్రారంభమైన మొబైల్ నంబర్లు 8,7,6 సిరీస్‌లకు మారాయి. దీనివల్ల కొన్ని కోట్ల కొత్త నంబర్ల సృష్టి జరిగింది. అంతకుముందు ల్యాండ్ లైన్ నంబర్లలో ఆరు నంబర్లే ఉండేవి. అవి ఇప్పుడు ఏడుకు చేరాయి.
ఏంఏం మారునున్నాయ్?
ట్రాయ్ ప్రతిపాదించిన కొత్త సిఫార్సుల వల్ల పది నంబర్లుండే మొబైల్ నంబర్ కాస్త పదకొండు నంబర్లకు మారనుంది. ప్రతి మొబైల్ నంబర్ ముందు అదనంగా ‘9’ డిజిట్ చేరనుంది. మరోవైపు నెట్ కనెక్షన్ కోసం ఉపయోగించే డాంగిల్స్‌లో ప్రస్తుతం పది అంకెలుండే మొబైల్ నంబర్‌ను వాడుతున్నారు. దీని స్థానంలో ఇకపై 13 అంకెలుండే కొత్త నంబర్లు అందుబాటులోకి రానున్నాయి. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే మొబైల్ నంబరుకు ముందు ‘0’ను అదనంగా చేర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్ లైన్‌కు చేస్తే ఎలాంటి అదనపు నంబర్‌ను చేర్చాల్సిన అవసరం లేదు
మార్పు మంచికే..
ట్రాయ్ తీసుకువచ్చిన ఈ కొత్త ప్రతిపాదనల వల్ల ఇప్పటికిప్పుడు ప్రయోజనమేమి లేకపోయినా.. రానున్న కాలంలో చాలా మేలు జరగనుంది. ఎందుకంటే ఈ సాంకేతిక యుగంలో రోజురోజుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతూనే ఉంది. సగటున ఒక్కో వినియోగదారుడు రెండు నుంచి మూడు నంబర్లను వాడుతుండటం కూడా కొత్త నంబర్ల సృష్టికి ఊతమిస్తోంది. ప్రస్తుతం 11 నంబర్ల ప్రతిపాదనను టెల్కోలు వ్యతిరేకిస్తున్నా.. దీర్ఘకాలంలో ఈ ప్రతిపాదన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది

0 Response to "11 డిజిట్స్ నెంబరెందుకు?"
Post a Comment