రాష్ట్రంలో రెండో దశ
మక్కా నుంచి వచ్చిన
విశాఖ వాసి ద్వారా
కుటుంబ సభ్యురాలికి పాజిటివ్
వ్యాప్తి విజృంభిస్తోందని ఆందోళన
విశాఖలో తొమ్మిది మందికి నెగటివ్
రాష్ట్రంలో 13 అనుమానిత కేసులు
విశాఖలో ఏడు.. కృష్ణాలో మూడు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చి రెండో దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలోనే పాజిటివ్ కేసులు తేలగా తాజాగా స్థానిక వ్యక్తికి వైరస్ నిర్ధారణ అయింది. ఇటీవల మక్కా నుంచి వచ్చిన విశాఖలోని అల్లిపురం వాసి (66) కరోనా వైరస్ బారినపడినట్టు నాలుగు రోజుల క్రితం అధికారులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులను కూడా ఆస్పత్రికి తరలించి వారి నమూనాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. వారిలో ఒకరు కొవిడ్-19 బారినపడినట్టు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఆరో కేసు నమోదైనట్టయింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి స్థానికులకు పాకడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కాగా.. రోజుల కిందట విశాఖలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో చేరిన 9 మందికి వ్యాధి లేదని తేలింది. ఇదిలావుండగా, ఆదివారం మరో ఏడుగురు కరోనా అనుమానిత లక్షణాలతో ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో చేరారు. వారి నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపించారు.
బెజవాడలో హై అలర్డ్
కరోనా మహమ్మారి కమ్ముకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కృష్ణా జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో విజయవాడలో హైఅలర్ట్ అమలవుతోంది. పాజిటివ్ కేసు నమోదైన వన్‌టౌన్‌లోని మేకావారి వీధి నుంచి సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 30 కార్పొరేషన్ డివిజన్లలో మనుషులు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ నెల 31 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. కాగా.. కృష్ణా జిల్లాలో మూడు అనుమానిత కేసులు కలకలం రేపాయి. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామ శివారు కేశ్యా తండాకు చెందిన యువకుడు కేరళలోని నిట్‌లో బీటెక్ చదువుతూ.. ఈనెల 13న స్వగ్రామానికి వచ్చాడు. దగ్గు, జ్వరం ఉండడంతో అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యులు అతనికి కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించారు. కాగా.. మల్లంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి పంజాబ్‌లో ఇంజనీరింగ్ చదువుతూ... ఈనెల 16న విజయవాడ చేరుకున్నాడు. అతడు అతను కూడా చల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. విజయవాడ వన్‌టౌన్‌లో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిని కరోనా అనుమానంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కుర్లా ఎక్స్‌ప్రె్‌సలో కోవిడ్ బాధితుడు
ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రె స్‌లో ఓ ప్రయాణికుడు కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురవడంతో సహప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టీసీ సాయంతో అతన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన ఒక వ్యక్తి క్రొయేషియా నుంచి రాగా.. వైద్యులు కరోనా అనుమానిత కేసుగా గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చిత్తూరు జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలంలోని వ్యక్తి బెంగళూరులోని చైనాకు చెందిన కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతం కావడంతో సొంత గ్రామానికి వచ్చిన అతను జ్వరంతో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీ వైద్యుడిని సంప్రదించాడు. అతడిని 108 అంబులెన్స్‌లో రుయా ఆస్పత్రికి తరలించారు.
తప్పుడు వార్త ప్రచారం.. అరెస్ట్
ఒడిసాలోని రాయగడ జిల్లా జె.కె.పూర్ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ శరవణ తెలిపారు. పితామహల్ గ్రామానికి చెందిన విన్నపల్లి శ్రీనివాసరావు (44)అనే ఉపాధ్యాయుడు వాట్సా్‌పలో పెట్టాడు.
నెల్లూరు వాసి రిపోర్టు నెగెటివ్!
నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్సత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ పాజిటివ్ యువకుడు పూర్తిగా కోలుకుంటున్నాడు. ఐసోలేషన్‌లో చేరి 14 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం అతని నమూనాలు సేకరించి తిరుపతి స్విమ్స్‌కు పంపగా.. కరోనా నెగెటివ్ అని వచ్చింది. కాగా.. మరోసారి శాంపిల్స్ పంపి పరీక్షించిన తర్వాతే అతన్ని డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. కాగా.. ఐసోలేషన్‌లో ఉన్న కావలి నుంచి తీసకొచ్చిన తల్లీ కొడుకులతోపాటు, బార్బర్, కొడవలూరుకు వచ్చిన ఆస్ట్రియా దేశస్థుడికి రిపోర్టులో నెగెటివ్ వచ్చింది. ఆదివారం జ్వరం, జలుబుతో బాధపడుతున్న వ్యక్తిని మద్రాసు బస్టాండ్ వద్ద గుర్తించిన పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు
0 Response to "రాష్ట్రంలో రెండో దశ"
Post a Comment