ఇంటర్‌లో ఈ–అడ్మిషన్లు
2020–21 విద్యా సంవత్సరం నుంచి అమలు
ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు
ఫీజుల చెల్లింపులు సైతం ఆన్‌లైన్‌లోనే...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో
ఇంటర్మీడియెట్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2020–21) నుంచి ఆన్‌లైన్
ప్రవేశాల (ఈ–అడ్మిషన్లు) విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రైవేట్,
ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్య కళాశాలల్లో ఆటోమేటెడ్ ఆన్‌లైన్
అడ్మిషన్ సిస్టమ్ (ఈ–అడ్మిషన్స్) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని
ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు
బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ మే, జూన్
నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్
‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ప్రైవేట్ కాలేజీలకు ముకుతాడు
ఆన్‌లైన్‌లోనే ప్రవేశాలు కల్పిస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకున్న ఈ
నిర్ణయంతో ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనార్టీలకు నిర్దేశించిన రిజర్వేషన్లను ఈ కాలేజీలు అమలు చేయడం లేదు.
బోర్డు అనుమతించిన సెక్షన్లకు మించి విద్యార్థులను చేర్చుకుం టున్నాయి.
ఇకపై ఇంటర్ బోర్డే స్వయంగా ఈ –అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించనుంది.
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై
బోర్డు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాలేజీల వారీగా నిర్ణయించే ఫీజులనూ
ఈ ఆన్‌లైన్ అడ్మిషన్లకే అనుసంధానించి, విద్యార్థులు ఆ మేరకే చెల్లించేలా
ఇంటర్ బోర్డు ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇంటర్ బోర్డు పుస్తకాలను బోధించాల్సిందే
కొన్ని కాలేజీలు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిన పాఠ్య పుస్తకాలను
పట్టించుకోవడం లేదు. జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు తర్ఫీదు
ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. ఇందుకోసం రూ.లక్షల ఫీజులు వసూలు
చేస్తున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డు రూపొందించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే
విద్యార్థులకు బోధించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు
0 Response to "ఇంటర్‌లో ఈ–అడ్మిషన్లు"
Post a Comment