21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తర్వాత మున్సిపల్, చివర పంచాయతీ ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించనున్న రాష్ట్ర ప్రభుత్వం
90 శాతం హామీలు నెరవేర్చామని అతివిశ్వాసంతో ఉండొద్దు: మంత్రివర్గ
సమావేశంలో మంత్రులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ
నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు
నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం
సూచించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ
సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. అయితే పోలింగ్
తేదీలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుందని అభిప్రాయపడినట్లు సమాచారం.
మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఈ విషయమై మంత్రులతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 90 శాతం హామీలను నెరవేర్చామని
అతి విశ్వాసంతో ఉండొద్దు. ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చాం. ఇదివరకెన్నడూ
లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం, మహిళల రక్షణ కోసం
ప్రత్యేక చట్టాలు చేశాం. ఇన్ని పనులు చేశామని ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దు.
కచ్చితంగా సింహ భాగం గెలవాలి. డబ్బు, మద్యం ఎక్కడా కనిపించకుండా ఎన్నికలు
నిర్వహించాలని మరోసారి చెబుతున్నా. డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు
నిర్ధారణ అయితే, ఎన్నికైన తర్వాత కూడా ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు
ఖాయం’ అని స్పష్టం చేసినట్లు తెలిసింది.
1.5 కోట్లకు పైగా కుటుంబాలకు నగదు బదిలీ
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయనే సంకేతాలను ముఖ్యమంత్రి ఇచ్చినట్లు తెలిసింది. అధికారం చేపట్టి ఏడాది కూడా
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సింహ భాగం అమలు చేశామని, ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీలను చేరవేశామని, అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో కోటిన్నరకు పైగా కుటుంబాలకు నగదు బదిలీ చేశామని వివరించినట్లు తెలిసింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 47 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చామని, అమ్మఒడి పథకం ద్వారా 42 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేశామని, జగనన్న వసతి దీవెన కింద 11.87 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు బదిలీ చేశామని, సంతృప్త స్థాయిలో అర్హులైన వారందరికీ పెన్షన్లు, బియ్యం కార్డులు మంజూరు చేశామని వివరించినట్లు సమాచారం. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ వాలాలకు.. మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే ఆర్థిక సాయం అందించామని, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏకంగా 95 శాతం పైగా కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఆరోగ్య భరోసా కల్పించామని, దీంతో పాటు దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఉగాది నాటికి అర్హులైన 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామని, వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామని సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది.
2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రావాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఆదేశించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే పని తీరుకు
నిదర్శనమని, 2019 సాధారణ ఎన్నికల కంటే కూడా మెరుగైన ఫలితాలు రావాలని
స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు
బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
అభివృద్ధి పథకాల గురించి ఇంటింటా వివరించాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత సిబ్బంది నియామకంతో పాటు గ్రామ, వార్డు
వలంటీర్లతో కలిపి మొత్తం 4 లక్షలకుపైగా ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చామని
సీఎం జగన్ గుర్తు చేసినట్లు తెలిసింది. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు
చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలని.. ఇందుకు అనుగుణంగా మంత్రులు
కార్యాచరణతో ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఈ నెల 8లోగా మండల
ఇన్‌చార్జిల నియామకాలు ముగించి, స్థానిక సంస్థల ఎన్నికలకు మంత్రులు,
ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలని సీఎం సూచించినట్లు తెలిసింది. పార్టీలో
ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడమే కాకుండా అందరినీ కలుపుకుని
వెళ్లాలని స్పష్టం చేసినట్లు సమాచారం
0 Response to "21.. 24.. 27న స్థానిక ఎన్నికలు? "
Post a Comment