రూ.70వేల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌



  • బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు మంత్రి మండలి ఆమోదం
  • కరోనా నివారణకు కఠిన నిబంధనలు
  • క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే రాష్ట్రంలోకి  
  • ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలి 
  • రూ.3 కోట్లతో కలెక్టర్ల వద్ద అత్యవసర నిధి


అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రిమండలి ఈ ఏడాది జూన్‌ 30వరకూ రూ.70వేల కోట్లతో ఓటాన్‌ అకౌట్‌ బడ్జెట్‌ను ఆమోదించింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించలేని పరిస్థితుల్లో... ఆర్డినెన్సును రూపొందించి, గవర్నర్‌ ఆమోదం పొందాలని తీర్మానించింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన అజెండా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ సమ్మతి తెలిపింది. అనంతరం కరోనా విజృంభణ, తదనంతర పరిణాలమాలు, వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. మంత్రి పేర్ని నాని ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుందన్నారు. 


24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని, ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశామని వివరించారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలలో ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్‌-95 మాస్క్‌లు 52వేలు అందుబాటులోకి తెచ్చామని, వైద్యుల కోసం ప్రత్యేకంగా బాడీ మాస్క్‌లనూ 4వేలకు పైగా సిద్ధం చేశామని వివరించారు. జిల్లా, నియోజకవర్గస్థాయిల్లో ఏర్పాటు చేసిన ఆస్పత్రులకూ వసతులు సమకూర్చామన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.3 కోట్ల అత్యవసర నిధిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించడంతోపాటు తరచూ శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించారు. 


ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనవాళ్లను తీసుకురాలేకపోవడం బాధాకరమన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినందున వారిని రాష్ట్ర సరిహద్దుకే పరిమితం చేస్తున్నామన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు సమ్మతించిన వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనవాళ్లు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని మంత్రి కోరారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా ముఖ్యమంత్రులతో సీఎం జగన్‌  మాట్లాడుతున్నారన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రూ.70వేల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌"

Post a Comment