త్వరలో ఆటోమ్యుటేషన్‌ సేవలు

- ముమ్మరంగా కసరత్తు 
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో 
రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం త్వరలో ఆటోమ్యుటేషన్‌ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తేనుంది. ఆటోమ్యుటేషన్‌ సేవలతో భూముల క్రయ, విక్రయాలకు సంబందించిన లావాదేవీలు పూర్తికాగానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచే నోషనల్‌ సబ్‌ డివిజన్‌ నెంబర్లు కేటాయిస్తారు. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదుచేయడం, ఆన్‌లైన్‌లో తహశీల్ధార్‌ కార్యాలయాలకు సమాచారాన్ని పంపడంతో రైతులకు పాస్‌బుక్‌లు పొందడం సులభతరం కావడమే కాకుండా పాస్‌బుక్‌లో తప్పులు దొర్లడం, ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు నమోదు కావడం లాంటి సంఘటనలు జరగవని అధికారులు చెబుతున్నారు
ఇప్పటి వరకు విలువైన భూములు, వివాదాస్పదమైన భూములకు సంబందించి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయాల్సిఉంది. అయితే, గడువు పూర్తయ్యే లోగా సంబంధిత తహశీల్ధార్‌ డిజిటల్‌ సంతకం కాకుండా మేనేజ్‌ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా అంగీకరించడం లేక తిరస్కరించడమో ఆయా తహశీల్దార్లు చేయాల్సి ఉంటుంది. అనంతరం 16వ రోజు నుంచి తహసిల్ధార్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెడితే ఆటోమేటిక్‌గా డీమ్డ్‌మ్యుటేషన్‌ జాబితాలో చేరుతుంది.

తహసిల్దార్‌ సెలవులో వెళ్లినా ఇదే స్థితి! ఇక నుండి ఈ విధానం ఉండదు. దీనికి బదులుగా ఆటోమ్యుటేషన్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబందించి ఆయా జిల్లా కలెక్టర్లకు సిసిఎల్‌ఎ అధికారులు పలు సూచనలు చేశారు.



పెండింగ్‌ విచారణను ఆయా తహశీల్ధార్లు చేపట్టాల్సి ఉంటుందని సిసిఎల్‌ఎ అధికా రులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబందించిన ఆర్డీఓకు దరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో మ్యుటేషన్‌ గురించి గ్రామాల్లో ప్రచారం నిర్వహించా లని, అవసరమైన చోట ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని ఫ్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అప్పీలు చేసుకునేందుకు 60 రోజులు గడువు ఉంటుంది. రివిజన్‌ ప్రక్రియ 90 రోజుల్లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిర్ణయం తీసుకుంటారు. ఆటోమ్యుటేషన్‌ అనంతరం భూమి రికార్డులను 18 వరుసలలో నమోదుచేస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో ఆటోమ్యుటేషన్‌ సేవలు"

Post a Comment