ఈ వేసవి.. చాలా హాట్‌ గురూ!


రాయలసీమలో ఎండమంటలు

కోస్తాపై వడగాడ్పుల ప్రభావం 

ఏప్రిల్‌, మేలలో మరింత తీవ్రం

సాధారణం కంటే 0.5-1 డిగ్రీలు 

ఎక్కువగా నమోదయ్యే అవకాశం

ఎంఎంసీఎఫ్‌ఎస్‌ మోడల్‌తో

స్పష్టం

బులెటిన్‌ విడుదల చేసిన ఐఎండీ



విశాఖపట్నం, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో మాడు పగిలే ఎండలు కాయనున్నాయి. రాయలసీమ మండనుంది. కోర్‌ హీట్‌వేవ్‌ జోన్‌లో ఉన్న కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సీమతో పోల్చితే ఉష్ణోగ్రతలు సాధారణం లేదా కొంచెం అధికంగా నమోదు కానున్నాయి. అయితే వడగాడ్పుల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు (వేసవి సీజన్‌)గాను దేశంలో ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు, వడగాడ్పులపై బులెటిన్‌ విడుదల చేసింది. 1982- 2008వరకు నమోదైన వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాబోయే 3నెలల్లో వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసింది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘మాన్‌సూన్‌ మిషన్‌ కపుల్డ్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌(ఎంఎంసీఎ్‌ఫఎస్‌)’ ఒక మోడల్‌ రూపొందించింది. 


తాజా బులెటిన్‌ వివరాలు...

  1. వాయవ్య, మధ్య భారతం, తూర్పు/ఈశాన్య భారతంతో పాటు దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి కిందనున్న ఛత్తీ్‌సగఢ్‌/ మహారాష్ట్ర, రాజస్థాన్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు, దక్షిణాదిన కర్ణాటకలో కోస్తా ప్రాంతాలు, కేరళ, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5- 1డిగ్రీ ఎక్కువగా నమోదవుతాయి.  కోర్‌హీట్‌ వేవ్‌ జోన్‌గా గుర్తించిన పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీలో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు సాధారణానికి మించి వీయడానికి 38శాతం అవకాశం ఉంది. 
  2. రాష్ట్రంలో ఎండలు పెరిగి, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5నుంచి ఒక డిగ్రీ ఎక్కువగా నమోదవుతాయి. రాయలసీమతో పోల్చితే కోస్తాంధ్రలో ఎండలు సాధారణం. 
  3. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది. వేసవి సీజన్‌ మొత్తం ఇవే పరిస్థితులు కొనసాగుతాయి. రానున్న 4 వారాలకు గాను ఎండలు, వాతావరణ పరిస్థితులపై ప్రతి గురువారం ఒక బులెటిన్‌ విడుదల చేయాలని వాతావరణ శాఖ నిర్ణయించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈ వేసవి.. చాలా హాట్‌ గురూ!"

Post a Comment