పీఆర్సీ నివేదిక నెలాఖర్లోగా!
ఫిట్‌మెంట్ 24% లోపే..?
వేతనాలకు మూడు శ్లాబులు!
హైదరాబాద్/సంగారెడ్డి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) నివేదికకు వేళైంది. నెలాఖరులోగా నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ఆదేశించింది. ఈ నెల 24తో కమిషన్ గడువు పూర్తికానుంది. ఆలోగా నివేదిక అందించడానికి యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మార్చిలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు నివేదిక అందితే దాన్ని అధ్యయనం చేసి, మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. వయోపరిమితి పెంపుపై కూడా నివేదిక అందించే అవకాశాలున్నాయి.
వాస్తవానికి ఏడాదిన్నర నుంచి వేతనాల పెంపుపై ఊగిసలాట కొనసాగుతోంది. 2018 ఆగస్టులోనే వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించినా అమలు కాలేదు. ఏడాదిపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులెవరినీ సీఎం దగ్గరికి రానివ్వలేదు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ సమ్మె జరుగుతుండడంతో ఉద్యోగ జేఏసీ నేతలను పిలిచి భోజనం పెట్టిన సీఎం.. ఎన్నికలు కాగానే భేటీ ఉంటుందని సంకేతాలిచ్చారు. కానీ, ఆ తర్వాత భేటీ జరగలేదు. ఇక నవంబరు 10న సీఎం కార్యాలయం నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. 10-12 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పీఆర్సీని ఆదేశించినట్లు ప్రకటించింది. అయినా నివేదిక ప్రభుత్వానికి చేరలేదు. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. ఉద్యోగులకు ఎంతో కొంత వేతన సవరణ చేస్తాం' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే నివేదిక ఇచ్చే పనిని పీఆర్సీకి పురమాయించినట్లు తెలిసింది.
24 శాతం లోపే..?
నివేదిక ఇచ్చినా ఫిట్‌మెంట్ 24శాతం లోపే ఉంటుందని సమాచారం. రాష్ట్రంలో 3.80 లక్షల మంది దాకా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా.. పెన్షనర్లు 2.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కశాతం ఫిట్‌మెంట్ అమలు చేసినా ఏడాదికి రూ.250 కోట్లు అవుతుందని ప్రభుత్వం లెక్క వేసింది. 24 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే రూ.6000 కోట్ల దాకా కానుంది. ప్రతినెలా రూ.500 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వేతన బకాయిలూ 6000 కోట్లు కానున్నాయి. గతంలో 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలను చెల్లించిన ప్రభుత్వం.. ఈ దఫా వాటిని మరింత పెంచే అవకాశాలు లేకపోలేదు.
పీఆర్సీ గడువు పొడిగిస్తే ఊరుకోం
పీఆర్సీ నివేదిక గడువు పొడిగిస్తే ఊరుకోబోమని టీఎన్జీవోల సంఘం అఽధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ హెచ్చరించారు. సంగారెడ్డిలో గురువారం వారు 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. పీఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించిందన్నారు. ఈ నెల 24లోగా కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై పీఆర్సీ సభ్యులను కూడా కలిసి కోరతామన్నారు. పీఆర్సీని కూడా 2018 జూలై 1 నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆరేళ్లలో దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు

0 Response to "పీఆర్సీ నివేదిక నెలాఖర్లోగా!"
Post a Comment