కరెంటు వాడకం పెరిగితే శ్లాబ్‌ మారినట్లే!


  • కరెంటు వాడకం పెరిగితే శ్లాబ్‌ మారినట్లే!..
  • 75 యూనిట్లు వాడితే రేటు 1.45
  • వినియోగం దాటితే మొత్తానికీ బాదుడే..
  • యూనిట్‌కు 2.60 చొప్పున కట్టాల్సిందే



అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): అల్పాదాయ విద్యుత్‌ వినియోగదారులు వేసవిలో ఫ్యాన్‌ వేసుకోవాలంటే ఇక

భయపడాల్సిందే. ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న కొత్త విద్యుత్‌ చార్జీల విధానమే దీనికి కారణం. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) విడుదల చేసిన టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకారం.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. వారిలో నెలకు 500 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వాడుకునే వినియోగదారులు 1.35 లక్షలు. వీరికి మాత్రమే విద్యుత్‌ చార్జీల పెంపు వర్తిస్తుందని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ప్రకటించాయి.


కానీ విద్యుత్‌ చార్జీల ఖరారు విధానంలో అవి చేసిన మార్పుతో అల్పాదాయ, చిన్న వినియోగదారులకు షాక్‌ తగలనుంది. ఇప్పటిదాకా.. గడచిన ఏడాదిలో మొత్తం వినియోగాన్ని లెక్కించి.. వినియోగదారులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజిస్తున్నారు. 900 యూనిట్ల వార్షిక వినియోగం ఉన్నవారిని గ్రూప్‌-ఏలోను, 900 నుంచి 2,700 యూనిట్ల మధ్య వినియోగం ఉన్నవారిని గ్రూప్‌-బీలోను, 2,700కి మించి వినియోగించేవారిని గ్రూప్‌-సీలో పెట్టి.. ఆయా గ్రూపులకు నిర్దేశిత శ్లాబుల ప్రకారం.. తదుపరి ఏడాది మొత్తం చార్జీలు వసూలు చేస్తున్నారు.


2018-19లో వినియోగం ప్రకారం 2019-20లో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 2020-21కి తాజాగా జారీచేసిన కొత్త టారిఫ్‌ విధానం ప్రకారం.. మూడు గ్రూపుల విధానంలో మార్పులు చేయలేదు. కానీ ఎవరు ఏ గ్రూపులోకి వస్తారనేది గత వార్షిక వినియోగాన్ని ఆధారంగా చేసుకోకుండా.. ఏ నెలకు ఆ నెలలో వాడకాన్ని బట్టి వారు ఏ గ్రూపులోకి వస్తారనేది నిర్ణయించనున్నారు. దీనివల్ల నెలకు 75 యూనిట్ల వరకు గ్రూప్‌-ఏలోను, 76 నుంచి 225 యూనిట్ల వరకు గ్రూప్‌-బీలోను, 225 యూనిట్లకు పైన గ్రూప్‌-సీలోను ఉంటారు. 


చిన్న వినియోగదారులకు..

ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న కొత్త విధానం ప్రకారం.. ప్రతి నెలా శ్లాబులు మారిపోనున్నాయి. ఆ నెలలో వాడే విద్యుత్‌ వాడకాన్ని బట్టి శ్లాబ్‌ ఉంటుంది. ఒక సామాన్య వినియోగదారుడు నెలకు 75 యూనిట్ల చొప్పున 9 నెలలు వాడుకున్నాడు. దీని ప్రకారం అతడు కొత్తగా డిస్కమ్‌లు ప్రకటించిన గ్రూప్‌-ఏ వినియోగదారుల కేటగిరీలోకి వస్తాడు. వీరు మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 (రూ.72.50), మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున (రూ.65) చార్జీ చెల్లించాలి.


ఈ రకంగా 75 యూనిట్లకు రూ.137.50 (ఇంధన చార్జీలు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. వేసవి నుంచి ఉపశమనం పొందడానికో లేక మరే కారణం వల్లో ఆ వినియోగదారు 75 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తే.. మొత్తానికీ గ్రూప్‌-బీ శ్లాబు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి యూనిట్‌కు రూ.2.60 చొప్పున చెల్లించాలి. మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున చెల్లించే అవకాశం ఉండదు. ఉదాహరణకు.. ఒక నెలలో 80 యూనిట్లు వాడుకుని ఉంటే ఈ ప్రకారం రూ.208 (ఇంధన చార్జీలు అదనం) చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం.. ఒక నెలలో ఎక్కువ, మరో నెలలో తక్కువ అన్న పద్ధతి లేదు.

ఏడాదికి 900 యూనిట్లు (నెలకు 75 యూనిట్లు) వాడుకునే వినియోగదారుడు గ్రూప్‌-ఏలోకే వస్తాడు. ఒక నెల వాడకం పెరిగినా.. మరో నెలలో తగ్గినా ఏడాది పొడవూ ఇదే శ్లాబ్‌ ఉంటోంది. తద్వారా 50 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.45 చెల్లిస్తున్నాడు. కొత్త పద్ధతిలో ఈ అవకాశం ఉండదు.

కొసమెరుపు..: ఎక్కువ విద్యుత్‌.. అంటే నెలకు 225 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడే వినియోగదారులందరినీ గ్రూప్‌-సీలో చేర్చారు. ఈ గ్రూప్‌లో నిర్ణయించిన చార్జీల ప్రకారం నెలకు 226 యూనిట్లు (యూనిట్‌కు రూ.2.65) వాడుకున్న వినియోగదారు రూ.1,024.60 (ఇంధన చార్జీలు అదనం) చెల్లించాల్సి ఉంటుంది. 8 నెలలపాటు ఈ రకంగా విద్యుత్‌ వాడుకున్నారు. బిల్లు కూడా గ్రూప్‌-సీ శ్లాబుల్లోని చార్జీల ప్రకారం వస్తుంది.


మిగతా 4 నెలల్లో విద్యుత్‌ వాడకం నెలకు 225 యూనిట్ల కంటే తక్కువే ఉంటే ఈ నాలుగు నెలలూ అతను గ్రూప్‌-బీలోకి వస్తారు. గ్రూప్‌-సీ కంటే గ్రూప్‌-బీలోని వినియోగదారులకు శ్లాబ్‌ చార్జీలు తక్కువ. దీంతో ఆ మేరకు ఈ వినియోగదారులకు చార్జీ పరంగా ఉపశమనం కలుగుతుంది. ఈ4 నెలల్లో ప్రతి నెలా అతడు నెలకు 200 యూనిట్లు వాడుకుంటే ఆ కాలానికి నెలకురూ.620 (ఇంధనచార్జీలు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ అతడు ఏ ఊరైనా వెళ్లి.. ఒక నెలలో వాడకం 75 యూనిట్లే వచ్చింది. అప్పుడు గ్రూప్‌-ఏ.. అంటే తొలి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 పైసల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.


విద్యుత్‌ చార్జీలు

కేటగిరి    యూనిట్‌ 

               చార్జీ

గ్రూప్‌ ఎ:

900 యూనిట్ల లోపు

0-50  1.45

51-100 2.60

101-200 3.60

200 దాటితే 6.90


గ్రూప్‌ బి: 900 నుంచి 2700 యూనిట్లు

0-50         2.60

51-100 2.60

101-200 3.60

201-300 6.90

300 దాటితే 7.75


గ్రూప్‌ సి: 2700 యూనిట్లకుపైగా..

0-50 2.65

51-100 3.35

101-200 5.40

201-300 7.10

301-400 7.95

401-500 8.50

500 దాటితే 9.95

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరెంటు వాడకం పెరిగితే శ్లాబ్‌ మారినట్లే!"

Post a Comment