8న దేశం బంద్.. ఏకంగా 25 కోట్లమంది సమ్మె
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న దేశవ్యాప్త అఖిల భారత సమ్మెకు వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సమ్మెను భారీగా విజయవంతం చేయాలని పోరాట సంఘాలు భావిస్తున్నాయి. సుమారు 25 కోట్ల మంది పాల్గొంటారని పది కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం తెలిపాయి.
ఆరు ఉద్యోగ సంఘాలు (ఏఐబీఈఏ, ఏఐబీఓఏ,బీఎఫ్‌ఎప్‌ఐ, ఐఎన్ బీఈఎఫ్, ఐఎన్ బీఓసీ, బీకేఎస్‌ఎంఈ) సమ్మెలో పాల్గొనాలని నిర‍్ణయించాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించింది. అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరనున్నాయి
జనవరి 2, 2020న తమ డిమాండ్లపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైందనీ, దీంతో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు (సిటియు) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యార్థుల సంస్థలు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయని తెలిపారు.
జెఎన్‌యూలో చెలరేగిన హింసను కార్మిక సంఘాలు ఖండించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావం తెలిపారు. 175 మందికి పైగా రైతు, వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతోపాటు 'గ్రామీణ భారత్ బంద్' పేరుతో ఈ సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలిపాయి. కాగా, 2020 జనవరి 8 న దేశవ్యాప్త సమ్మెకు గత సెప్టెంబర్‌లో కార్మిక సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే
0 Response to "8న దేశం బంద్.. ఏకంగా 25 కోట్లమంది సమ్మె"
Post a Comment