మూడో ఏటే బడికి!
- ఇంజనీరింగ్, ఫార్మశీ కాలేజీలకు
- రెండేళ్లపాటు అనుమతులు బంద్
- ఏపీ, తెలంగాణల్లో అటల్ శిక్షణ కేంద్రాలు
- శిక్షణ పూర్తిచేసిన వారికే పదోన్నతులు
- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
- ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధి వెల్లడి
విశాఖపట్నం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి):
ఇప్పటి వరకు చిన్నారులు స్కూళ్లలో ప్రవేశించేందుకు కనీస వయసు ఐదేళ్లు
ఉండాలనే నిబంధనను త్వరలోనే తొలగించనున్నారు. మూడేళ్లకే బడులకు పంపేందుకు
అనుమతించనున్నారు. ఈ మేరకు దేశంలోని విద్యా వ్యవస్థలో త్వరలో సమూల మార్పులు
రాబోతున్నాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) చైర్మన్
ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధే తెలిపారు. గీతం విశ్వవిద్యాలయం
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ఇప్పుడున్న విద్యా వ్యవస్థ స్థానంలో 5+ 3+ 3+ 4 విధానం అమల్లోకి
వస్తుందన్నారు. విద్యార్థులకు తరగతిలో బోధన కంటే ఇంటరాక్షన్, పరిసరాల
పరిశీలన ద్వారా బోధనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశంలో గత పదేళ్ల నుంచి
ఏడాదికి 200 ఇంజనీరింగ్ కాలేజీల చొప్పున మూత పడుతున్నాయని చెప్పారు.
ప్లస్2 సైన్స్ విద్యార్థుల సంఖ్య కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు
ఎక్కువగా ఉన్నందున 50ు సీట్లు మిగిలిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే
రెండేళ్లు ఇంజనీరింగ్, ఫార్మశీల్లో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని
స్పష్టం చేశారు
160కి క్రెడిట్స్ తగ్గింపు
ఇంజనీరింగ్
కాలేజీల్లో 220 రకాల క్రెడిట్స్(సబ్జక్ట్స్) ఉన్నాయని, వాటిలో గందరగోళం
తగ్గించడానికి 160కి కుదించినట్టు సహస్రబుద్ధే చెప్పారు. విద్యార్థులకు ఒకే
రకమైన సబ్జక్టు కాకుండా వాటితో సంబంధమున్న ఇతర అంశాల్లోను అధ్యయనం
చేయడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. మెకానికల్ విద్యార్థికి
ఎలక్ర్టానిక్స్‌పై ఆసక్తి ఉంటే అది కూడా చదువుకునే అవకాశం కల్పించామన్నారు.
అన్ని సబ్జెక్టుల విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో చదువుకునే అవకాశం
ఇస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఎక్కువ
ప్రశ్నలు ఇస్తారని, ఇది కొత్త ఆలోచనలను చంపేస్తున్నట్టు గుర్తించామన్నారు.
దానిని 30ుకి కుదించి, మిగిలిన 70ు మార్కులను షార్ట్‌నోట్సులు, నాలెడ్జ్
అప్లికేషన్, కొత్త ఉత్పత్తి తయారీ వంటి అంశాలపై ఇస్తున్నామని వివరించారు.
ఆరు నెలల శిక్షణ తప్పనిసరి
నాలుగేళ్ల
ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు తప్పనిసరిగా ఆరు నెలలు పారిశ్రామిక
సంస్థలో శిక్షణ పొందాలనే నిబంధన అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల టీమ్
వర్క్, పరిశ్రమల్లో సమస్యలు, సమయ పాలనపై అవగాహన కలుగుతుందన్నారు.
టీచర్లకు అటల్ శిక్షణ కేంద్రాలు
ఇంజనీరింగ్
కాలేజీల్లోని బోధనా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు దేశంలో 4 చోట్ల
(జైపూర్, బరోడా, తిరువనంతపురం, గౌహతి) అటల్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు
చేసినట్టు సహస్రబుధి చెప్పారు. కాంట్రాక్టు టీచర్లకు ఈ శిక్షణ తప్పదన్నారు.
పదోన్నతి కోరుకునే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు అంతా వీటిని
పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అటల్ కేంద్రాలను
ఏర్పాటు చేస్తామని తెలిపారు.
2,700 కొత్త కోర్సులు
సాంకేతిక
విద్యలో 2,700 కొత్త కోర్సులను రూపొందించినట్టు సహస్రబుద్ధే తెలిపారు.
మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు(మూక్) అందుబాటులోకి తెచ్చామన్నారు.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టా్‌పల ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని వీటిని
చదువుకోవచ్చునన్నారు. దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదని, ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్
వంటి 12 రకాల అంశాల్లో శిక్షణ పొందితే విదేశాలకు వెళ్లకుండానే విద్యార్థులు
ఇక్కడే ఉన్నతస్థాయిలో స్థిరపడవచ్చని సహస్రబుద్ధే వివరించారు
0 Response to " మూడో ఏటే బడికి!"
Post a Comment