ఉద్యమ బాటలో ఉద్యోగులు

  • పీఆర్సీ, డీఏ, సీపీఎస్‌ సమస్యల పరిష్కారానికి డిమాండ్‌
  • 22న నల్లబ్యాడ్జీలతో విధులకు.. మధ్యాహ్నం ప్రదర్శనలు
  • డిసెంబరు 10న కలెక్టరేట్ల వద్ద.. 20న విజయవాడలో ధర్నాలు
అమరావతి, విజయవాడ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (ఏపీజేఏసీ) నిర్ణయం తీసుకుంది. శనివారం ఏపీఎన్జీవో హోంలో జేఏసీ సర్వసభ్య సమావేశం ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 11వ పీఆర్సీ నివేదికను సత్వరమే విడుదల చేసి అమలు చేయాలని, మూడు విడతల డీఏను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ విధానం రద్దుపై సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక విడుదల చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతన సవరణ కమిటీ ద్వారానే పీఆర్సీని అమల్లోకి తీసుకురావాలని కోరారు


 ఉద్యోగులకు ఉపయోగపడేలా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగులకు వైద్య సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు కోరారు. దాదాపు ఐదు నెలల నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, పలు శాఖల్లోని రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా నవంబరు నెల జీతాలు రాలేదని, జీపీఎఫ్‌, ఎఫ్‌టీఏ, ఏపీజీఎల్‌ఐ అడ్వాన్సుల బిల్లులు పాస్‌ కావడం లేదని.. వాటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు సమాంతరంగా తెలుగు మీడియం పాఠశాలలను కూడా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కోచైర్మన్లు బాబురెడ్డి, రఘురామిరెడ్డి, హృదయరాజు, గోపాలకృష్ణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ బండి శ్రీనివాసరావు ప్రసంగించారు. అన్ని జిల్లాల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
 
నవంబరు 22 నుంచి నిరసనలు
తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని, అదే రోజు మండల కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రదర్శన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 29న తాలూకా కార్యాలయాల వద్ద, డిసెంబరు 10న జిల్లా కలెక్టరేట్ల వద్ద, డిసెంబరు 20న విజయవాడలో రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహించాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఉద్యమ బాటలో ఉద్యోగులు"

Post a Comment