ఆస్తులకు ఆధార్‌ లంకె

  • ఇదే ప్రధాని మోదీ తదుపరి అస్త్రం
  • నల్ల ధనం, బినామీ నివారణకే
  • పాత కొనుగోళ్లకూ వర్తింపు?
  • తుది దశలో చట్ట రూపకల్పన


బినామీ పేర్లతో అడ్డగోలుగా ఆస్తులు కొనిపారేసే వారి గుండెలు గుభిల్లుమనే మరో చట్టం రాబోతోందా? విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా? ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. నోట్ల రద్దు తర్వాత అక్రమార్కులపై మోదీ సర్కారు సంధించబోతున్న ఆ కొత్త అస్త్రం.. ఆస్తులకూ.. ఆధార్‌కూ లంకె!!
 
న్యూఢిల్లీ, నవంబరు 16: ‘న ఖావూంగా.. న ఖానే దూంగా (నేను అవినీతికి పాల్పడను... ఎవరినీ పాల్పడనివ్వను..)’ అంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. నల్లధనంపై మరోసారి గురిపెట్టబోతున్నారు. బ్లాక్‌మనీని బయటపెట్టేందుకు తొలి ఐదేళ్లలో పలు కీలక చట్టాలు చేసిన ఆయన.. ‘ఆస్తులకు, ఆధార్‌కు లంకె’ అనే మరో భారీ ఆయుధాన్ని ప్రయోగించబోతున్నారు. అంటే, ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించడం! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన బిల్లు రూపకల్పన తుది దశలో ఉంది. నల్లధనం డబ్బు రూపంలో ఉండకుండా.. పెట్టుబడిగా మారి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీనివల్ల స్థలాలు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటి పేదలు, మధ్యతరగతివారు వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రెండు సమస్యలకూ ఒకేసారి చెక్‌ పెట్టేందుకే ఈ దిశగా మోదీ అధికారంలోకి రాగానే చర్యలు మొదలుపెట్టారు. దానివల్ల నల్లధనం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి చేరి చేతులు మారడం గణనీయంగా తగ్గింది.
 
‘2022 నాటికి అందరికీ ఇళ్ళు’ నినాదంతో ముందుకెళుతున్న మోదీ ప్రభుత్వానికి ఈ మార్పు కొత్త ఉత్తేజానిచ్చింది. ఇపుడు ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించడం వల్ల బినామీ లావాదేవీలు పూర్తిగా తగ్గుతాయని, పారదర్శకత పెరిగి, అందరికీ ఇళ్లు లభించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఆస్తులతో ఆధార్‌ అనుసంధానాన్ని చట్టం వచ్చాక జరిగే క్రయవిక్రయాలకే పరిమితం చేయకుండా.. గతకాలానికి కూడా వర్తింపజేయనున్నట్టు సమాచారం. దీనివల్ల.. బినామీ లావీదేవీలను దాచిపెట్టడం కుదరదు. కంపెనీల పేరిట కొన్న ఆస్తుల విషయంలోనూ కచ్చితమైన మార్గదర్శకాలు ఉంటాయి. కంపెనీ చరిత్ర, యాజమాన్యం ట్రాక్‌ రికార్డు.. ఇవన్నీ కూడా పరిగణనలోకి వస్తాయంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సహా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే జరుగుతున్నాయి.
 
దేశవ్యాప్తంగా ఏకీకృత చట్టం తేవడం ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే బినామీలను ఏరిపారేస్తుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు.. ‘‘ఆస్తి (ఇల్లు) ఎవరిపేరున ఉంటే వారి ఆధార్‌ నంబరు దానికి జత అయివుంటుంది. ఒకే ఆధార్‌ నంబరుతో పెద్దఎత్తున ఆస్తిని కలిగి ఉండడం అసాధ్యం. ఒకవేళ ఉన్నా ఆదాయపపన్ను యంత్రాంగం దృష్టిలో పడతారు. పైపెచ్చు లావాదేవీలన్నీ కూడా ఆధార్‌ నంబర్‌ సహితంగానే జరుగుతాయి. ఈ చర్యతో రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి అక్రమాలను నిర్మూలించడం ఖాయం’’ అని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలె్‌పమెంట్‌ కౌన్సిల్‌ సభ్యుడు రంజన్‌ బండేల్కర్‌ అన్నారు. ఇప్పటికే బినామీల పేరిట ఆస్తుల్ని రిజిస్టర్‌ చేసుకున్నవారు వాటిని డిజిన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని కూడా ఆయన వివరించారు. ఇళ్లు కొనుక్కునే వారికి ఇది మరింత భద్రతనిస్తుందని కౌన్సిల్‌ ఉపాధ్యక్షురాలు మంజూ యాజ్ఞిక్‌ అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆస్తులకు ఆధార్‌ లంకె"

Post a Comment