ఖండాంతరాలు దాటిన రామప్ప ఖ్యాతి

ఈనెల 22న ప్యారిస్‌కు రావాలని యునెస్కో పిలుపు

సిద్ధమవుతున్న కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: ములుగు జిల్లా పాలంపేటలోని 800 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్రను సొంతం చేసుకున్న రామప్ప ఆలయ ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. ఎంత చూసినా, ఎన్ని సార్లు చెప్పుకున్నా మళ్లీ తెలుసుకోవాలనే అద్భుత టెక్నాలజీతో నిర్మించిన ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం రెండుసార్లు పోటీకి వెళ్లినా ఫలితం కనిపించలేదు. అయితే ఈ ఏడాది మన దేశం నుంచి ఏకైక అపురూప కట్టడంగా దీన్ని నామినేట్‌ చేయడంతో యునెస్కో నుంచి ప్రతినిధుల బృందం సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో ఆలయాన్ని సందర్శించారు



అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రతినిధులతో ప్యారిస్‌లో ఈనెల 22న జరిగే సదుస్సుకు రావాలని కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ప్రతినిధులకు యునెస్కో నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో ఎవరిని పంపాలి, ఎలాంటి సమాచారంతో వెళ్లాలి, ఎంతమంది వెళ్లాలనే కోణంలో కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్యారిస్‌ పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం అధికారులు, హెరిటేజ్‌ ట్రస్టు ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.

ఏం చర్చిస్తారంటే..

యునెస్కో సమావేశంలో పాల్గొనే వివిధ దేశాల ప్రతినిధులు రామప్పపై క్షుణ్ణంగా చర్చిస్తారు. ఈ సందర్భంగా తలెత్తే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. సమావేశానికి రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు రామప్పకు సంబంధించిన పూర్తి సమాచారంతో వెళ్లనున్నారు. యునెస్కో గుర్తింపు కోసం కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు తయారుచేసిన ప్రతిపాదన దరఖాస్తు (డోజియర్‌), ఇటీవల పర్యటించిన యునెస్కో ప్రతినిధి వాసుపోశ్య నందన సేకరించిన సమాచారంతో సరిచూస్తారు. ఈ సందర్భంగా వచ్చే సందేహాలతో పాటు రామప్పలో ఉండాల్సిన సదుపాయాలు, స్థలాల గురించి చర్చించనున్నట్లు సమాచారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఖండాంతరాలు దాటిన రామప్ప ఖ్యాతి"

Post a Comment