సర్కారు బడుల్లో 'నీటి గంట

తక్షణ అమలుకు జిల్లా విద్యా శాఖ అధికారుల కార్యాచరణ

● విద్యార్థులు తగిన మోతాదులో నీరు తాగేలా చూడటమే సంకల్పం

● రోజుకు నాలుగు సార్లు మోగనున్న గంట

రాజమహేంద్రవరంలోని గాంధీపురం-2 ప్రాథమిక పాఠశాల్లో శుక్రవారం

'నీటి గంట' సమయంలో సీసాల్లోని నీటిని తాగుతున్న విద్యార్థినులు



కాకినాడ నగరం, న్యూస్‌టుడే : పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది తగిన మోతాదులో నీరు తాగడం లేదు. దీంతో విద్యార్థులు పలు వ్యాధుల బారినపడుతున్నారు. పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉన్నా, ఇళ్ల నుంచి సీసాల్లో నీటిని తీసుకెళ్లినా విద్యార్థుల్లో మాత్రం ఈ పరిస్థితిలో మార్పు ఉండటం లేదు


దీంతో పిల్లలు త్వరితగతిన నీరసపడుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని జిల్లా విద్యా శాఖ సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా నిత్యం తగిన మోతాదులో నీరు తాగేలా చూసేందుకు 'నీటి గంట' పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది.పిల్లలు కనీసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ పాఠశాలల్లో అధిక శాతం మంది విద్యార్థులు రోజుకు అర లీటరు నీటిని కూడా తాగడం లేదు. నీటిని తగిన రీతిలో తాగాలన్న అవగాహన లేకపోవడం.. పాఠశాలల్లో ఎక్కువగా నీరు తాగితే తరచూ మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెంగ..ఎడతెరిపి లేకుండా తరగతుల నిర్వహణ వంటి కారణాలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు పెరగడం, పిత్తాశయంలో రాళ్లు అడ్డుపడడం వంటి వ్యాధులు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులచేత నిత్యం నాలుగు పర్యాయాలు నీటిని తాగించేలా 'నీటి గంట' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈమేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దీనిని తక్షణం అమలు చేయాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (ఆర్జేడీ) నరసింహారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో రోజుకు నాలుగు సార్లు 'నీటి గంట'ను మోగించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు.

కేరళ స్ఫూర్తి

విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ సమస్యను అధిగమించేందుకు కేరళ రాష్ట్రంలోని చెరువత్తూరు, వలియపరంబు గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో ప్రత్యేకంగా 'నీటి బెల్లు' ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి మూడు గంటలకు ఒకసారి గంటను మోగిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న కర్నూలు జిల్లా అధికారులు 'నీటి గంట'కు శ్రీకారం చుట్టారు. ఇదే స్ఫూర్తితో తూర్పుగోదావరి జిల్లా అధికారులు కూడా ముందడుగు వేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దీని అమలుకు నడుంకట్టారు.

విద్యార్థులు ఏమి చేయాలి

ఇంటి వద్ద నుంచి విధిగా సీసా (బాటిల్‌) తెచ్చుకోవాలి. నిర్దేశించిన సమయంలో పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కొళాయిలు, ఇతర సదుపాయల నుంచి నీటిని పట్టుకుని తాగాలి. ఇందుకు 2 నుంచి 5 నిముషాల సమయాన్ని కేటాయిస్తారు. ఇంటి వద్ద నుంచి కూడా తాగునీటిని తెచ్చుకోవచ్ఛు

అన్ని పాఠశాలల్లో విధిగా అమలు చేయాలి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 'నీటి గంట'ను విధిగా అమలు చేయాలి. ఇది మంచి కార్యక్రమం కావడం వల్ల ప్రైవేటు పాఠశాలలు కూడా దీని అమలుకు చర్యలు తీసుకోవాలి.విద్యార్థులు సరిపడా నీరు తాగక పోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై నీరసిస్తున్నారు. పాఠశాలల్లో రోజుకు నాలుగు సార్లు గంట మోగించి విద్యార్థులతో నీళ్లు తాగించాలి. అన్ని పాఠశాలల్లో తాగునీటిని అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు నీటిని సీసాల్లో నింపుకుని తాగేలా చర్యలు చేపట్టాలి. - ఆర్‌.నరసింహారావు, ఆర్జీడీ, 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సర్కారు బడుల్లో 'నీటి గంట"

Post a Comment