ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌.


నూతన రవాణా చట్టం వచ్చినప్పట్నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సిబుక్‌, ఇన్సూరెన్స్‌ వంటి పత్రాలను తమ వెంట తీసుకెళ్లడం తప్పనిసరైంది. ఎప్పుడైనా పొరబాటున మర్చిపోతే ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా భారత ప్రభుత్వ సమాచార సాంకేతికశాఖ 'డిజిలాకర్‌' యాప్‌ను రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌ వున్న ప్రతి ఒక్కరూ ఉచితంగా ఈ సేవను వినియోగించుకోవడం ద్వారా తమ డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు ఫోన్లోనే సేవ్‌ చేసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడొచ్చు.
డిజిలాకర్‌ అనేది ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో పత్రాలు, అధికారిక ధ్రువపత్రాలు, విద్యా సంబంధిత పత్రాలు పౌరులకు నేరుగా చేరవేయడానికేగాక తనిఖీకి కూడా అవకాశం కల్పించే ఒక క్లౌడ్‌ ఆధారిత వేదిక.



ఇప్పుడు పౌరులకు అవసరమైన వివిధ అధికారిక పత్రాలన్నీ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో మంజూరు చేస్తున్నారు. వాటినే అధికారికంగానూ గుర్తిస్తున్నారు. ఈ డిజిలాకర్‌ను అధికారికంగా 2015లోనే పరిచయం చేసినప్పటికీ ఈ మధ్యనే ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా డిజిలాకర్‌తో అనుసంధానించబడిన ఏ ప్రభుత్వ శాఖ ద్వారానైనా జారీ చేయబడిన ధ్రువపత్రాలను వెనువెంటనే ప్రజలకు ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా చేర్చవచ్చు. ఉదాహరణకు జారీ చేయబడ్డ పత్రాలు- అనే ఆప్షన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఓటర్‌ ఐడీ కార్డు, పాన్‌కార్డు, గ్యాస్‌బుక్‌- దాని పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు జారీ చేసే విద్యా సంబంధిత పత్రాలు జారీ చేసిన వెనువెంటనే వాటి అర్హులకు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా చేర్చవచ్చు. ఇది ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, డిజిలాకర్‌తో అనుసంధానం చేయబడిన సంస్థలు జారీ చేసే ధ్రువపత్రాల కోసం కేటాయించబడిన విభాగం. ఇవన్నీ ఐటీ యాక్ట్‌-2000 ప్రకారం అధికారిక ధ్రువ పత్రాలుగా పరిగణించబడతాయి. ప్రయాణాలలో గుర్తింపు పత్రాలుగా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించుకోవాలంటే మీ డిజిలాకర్‌ మీ ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానించబడి ఉండాలి. రెండోది స్వయంగా దాచుకొన్న పత్రాలు. ఈ విభాగంలో వినియోగదారునికి సంబంధించిన పాత పత్రాలను స్కాన్‌ చేసుకొని, తన ఎలక్ట్రానిక్‌ సంతకాన్ని జతచేసి, ఆ పత్రాలను డిజిలాకర్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. అయితే ఇవి అధికారిక ధ్రువపత్రాలుగా చెల్లవు.

ఇన్‌స్టాలేషన్‌ :
* గూగుల్‌ ప్లేస్టోర్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అయితే అసలైన డిజిలాకర్‌ యాప్‌ ఐకాన్‌ కింద MeitY, Government of India ను చూసి, ధ్రువపర్చుకున్న తర్వాతనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* ఇన్‌స్టాల్‌ చేసుకొన్న తర్వాత సైన్‌అప్‌ ఆప్షన్‌ ఎంచుకొని, మీ మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేయాలి.
* రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఒటిపి వస్తుంది. అది నమోదు చేయాలి.
* తర్వాత ఈమెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేసి, సరైన పాస్‌వర్డ్‌ను ఎంచుకొని, నమోదు చేయాలి.
* ఆ తర్వాత ఆధార్‌ నెంబర్‌ను డిజిలాకర్‌తో అనుసంధానించడం ద్వారా మీ పేరుతో జారీ చేయబడే అన్ని ధ్రువపత్రాలను డిజిటల్‌ రూపంలో పొందవచ్చు.

డిజిలాకర్‌లోకి అనుసంధానించడం : 
1. ముందుగా మీ డిజిలాకర్‌ యాప్‌లోకి లాగిన్‌ అవ్వండి.
2. డిజిలాకర్‌ డాష్‌బోర్డులో చూపించబడుతున్న నోటిఫికేషన్స్‌ సెక్షన్‌లోని డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. అప్పుడు మీ డిజిలాకర్‌ రహదారి-రవాణా మంత్రిత్వశాఖతో అనుసంధానించబడుతుంది.
4. మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేసి, అక్కడే ఉన్న చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేయడం ద్వారా మీ అనుమతిని ఇవ్వండి.
5. అనంతరం గెట్‌ డాక్యుమెంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
అంతే.. మీ డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మీ మొబైల్లోని మీ డిజిలాకర్‌తో అనుసంధానం అవుతుంది.
6. అదే విధంగా, డిజిటల్‌ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంచుకొని, మీ వాహన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, వాహన ఛాసిస్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి, తద్వారా మీ వాహన ఆర్‌.సి.ని కూడా పొందవచ్చు.

ప్రస్తుతం అందజేస్తున్న సేవలు 
* సిబిఎస్‌ఇ ద్వారా జారీ చేయబడే డిజిటల్‌ మార్క్స్‌ షీట్స్‌
* సీటెట్‌- జూలై 2019 మార్క్స్‌ షీట్స్‌
* పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ మార్క్స్‌ షీట్స్‌ (ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకే పరిమితం)
* డిజిటల్‌ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డులు
* డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్స్‌
* కుల ధ్రువీకరణ పత్రాలు
* ఆధాయ ధ్రువీకరణ పత్రాలు
* బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు
* ఎంపిక చేయబడ్డ మరికొన్ని ఇతర సేవలు

- ఎం.రవికుమార్‌,
 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ 
ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌."

Post a Comment