రాముడికి రూ.450 కోట్లు

 అయోధ్య ప్రాజెక్టుకు యుపి క్యాబినెట్‌ ఆమోదం 
* సరయూ తీరాన 221 మీటర్ల విగ్రహం 
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అయోధ్య ప్రాజెక్టుకు అమితోత్సాహంతో నిధులు కేటాయించింది. రామ్‌ నగరి అయోధ్య పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టు కింద సరయూ నదీ తీరాన 221 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం నిర్మించనున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.447.46 కోట్ల ప్రజాధనాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదముద్ర వేసింది. అయోధ్య ప్రాజెక్టు కోసం మీరాపూర్‌ ప్రాంతంలో 61.38 హెక్టార్ల భూమిని కొనుగోలు చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా పరిసరాల అభివృద్ధి, సుందరీకరణ, డిజిటల్‌ మ్యూజియం, ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌, లైబ్రరీ, పార్కింగ్‌, ఫుడ్‌ ఫ్లాజా, లాండ్‌ స్కేపింగ్‌ తదితర వాటితో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు


కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) నుండి సేకరించిన నిధులను ఇందుకు కోసం వెచ్చించనున్నట్లు యోగి సర్కార్‌ పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో పోలీసులకు సెలవులు రద్దు 
బాబ్రీ మసీదు - అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిలాద్‌ ఉన్‌ నబీ, గురునానక్‌ జయంతి లాంటి పండుగలతోపాటు బాబ్రీ మసీదు - అయోధ్య కేసులో త్వరలో తీర్పు వెలువడనుండటంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నవంబర్‌ 1 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోరు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో 40 రోజుల విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గొగోరు ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో త్వరలో తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాముడికి రూ.450 కోట్లు"

Post a Comment