మైక్రో ఏటీఎం లావాదేవీలపై పరిమితి

బెంగళూరు: మీరు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)ల వినియోగదారులా? ఎక్కువగా మైక్రో-ఏటీఎం లావాదేవీలు చేస్తుంటారా..? అయితే.. ఇకపై మీ లావాదేవీలను చాలా పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. అటు ఎస్‌బీఐ, ఇటు బీఓబీ కూడా మైక్రో-ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించాయి. బీఓబీ లావాదేవీలను నెలకు నాలుగు సార్లకు కుదించగా.. ఎస్‌బీఐ కేవలం ఒక లావాదేవీకి మాత్రమే అనుమతించనుంది. 



అయితే.. ప్రభుత్వం అందించే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పథకంలో లేనివారు మాత్రం ఎస్‌బీఐలో నెలకు 5 లావాదేవీల వరకూ చేయవచ్చు. ఎన్‌పీసీఐ సలహా మేరకే తాము పరిమితులు విధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఏటీఎంలు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో బయోమెట్రిక్‌ వివరాలను వినియోగించి, రిటైల్‌ ఏజెంట్ల వద్ద వినియోగదారులు నగదును తీసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీన్నే మైక్రో ఏటీఎం లావాదేవీలుగా పేర్కొంటారు. అయితే.. వినియోగదారులు పలుమార్లు చిన్న చిన్న మొత్తాలుగా తీసుకుంటుండటంతో అందుకు సంబంధించిన కమిషన్‌ను ఏజెంట్లకు చెల్లించాల్సి వస్తుండటంతో తమకు నష్టం వాటిల్లుతోందని బీఓబీ వివరించింది. అయితే.. ఈ నిర్ణయం కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే వారికి ఇబ్బందులు ఎదురవుతాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మైక్రో ఏటీఎం లావాదేవీలపై పరిమితి"

Post a Comment