ఇంతకూ ఆర్థికమాంద్యం అంటే ఏమిటి?


ఇప్పుడు మీడియాలో ఎక్కువగా వినపడుతున్న మాట రిసెషన్ లేదా ఆర్థికమాంద్యం. ఎంతకాలం ఉంటుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వంటి విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ మొత్తం మీద మాంద్యం దిశగా ఆర్థికరంగం పరుగులు తీస్తున్నదనేది స్పష్టం. ఇది మొత్తంగా ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ సామాన్య జనానికి దీని గురించిన అవగాహన తక్కువ. అర్థశాస్త్రం ప్రకారం వ్యాపార చక్రంలో ఇదొక దశ. అంటే సముద్రానికి ఆటు-పోటు ఉన్నట్టుగానే వ్యాపారాలకూ ఆటుపోట్లు 




వస్తుంటాయి. అంటే ఉన్నతి తర్వాత పతనం, పతనం తర్వాత ఉన్నతి అన్నమాట. ఇంతకూ ఆర్థిక కార్యకలాపాల్లో మందగమనం ఎందుకు వస్తుంది? అంటే మౌలికంగా ప్రజలు డబ్బు ఖర్చు చేయకపోవడం వల్ల ఆర్థికమాంద్యం ఏర్పడుతుంది

వేరే మాటల్లో చెప్పాలంటే డిమాండ్ దారుణంగా తగ్గిపోవడం దీనికి కారణం. స్వదేశీ, విదేశీ వాణిజ్యంలో సమస్యలు తలెత్తడం, లేదా ఇంటర్నెట్, రియల్ బూమ్ వంటి ఆర్థికబుడగలు బద్దలు కావడం వంటివి దీనికి దారితీస్తాయి. అమెరికాలో ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృతస్థాయి మందగమనం ఏర్పడి, అది కొన్నినెలలపాటు కొనసాగడం జరిగితే దానిని మాంద్యంగా గుర్తిస్తారు. బ్రిటన్‌లో రెండు త్రైమాసికాల్లో వరుసగా ఆర్థిక కార్యకలాపాలు అడుగంటితే మాంద్యం ఏర్పడిందని అంటారు.

వాస్తవ జాతీయస్థూల ఉత్పత్తి, వాస్తవ ఆదాయాలు, ఉపాధి, పారిశ్రామిక ఉత్పత్తి, టోకు-చిల్లర అమ్మకాలలో దీని ప్రభావం కనిపిస్తుంది. అంటే జీడీపీ తగ్గిపోతుంది. మనదేశ జీడీపీ తగ్గినట్టు వార్తలు ఇప్పటికే వెలువడ్డాయి కూడా. ఆర్థికమాంద్యం వల్ల నిరుద్యోగం పెరగడమే కాకుండా ఉద్యోగాలు పోతాయి.

ఇటీవల కార్ల కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ఇందుకు ఓ ఉదాహరణ. దీని ద్వారానే మనకు ఆర్థిక మాంద్యం తలుపు తడుతున్నట్టు తెలిసింది. వినిమయం, పెట్టుబడులు, ఎగుమతులలో కూడా ఇది వ్యక్తమవుతుంది. అంటే ప్రజల అనాసక్తి వల్ల సరుకుల డిమాండ్ పడిపోయి వ్యాపారాలు కుదేలవుతాయి.

కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యయం తగ్గింపుపైనే దృష్టి నిలుపుతాయి. ఇదంతా ప్రపంచ దేశాలతో ముడిపడి ఉంటుంది కనుక ఎగుమతులూ తగ్గిపోతాయి. ప్రభుత్వాలు సాధారణంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కరెన్సీ సరఫరాను పెంచేస్తాయి. ప్రభుత్వ నిధులను అధికంగా ఖర్చు చేస్తాయి.

పన్నులు తగ్గిస్తాయి. ఇలాంటి చర్యల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మెరుగుపడతాయనేది ప్రభుత్వాల ఉద్దేశం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని ఇలాంటి ఉపశమన చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవలి దశాబ్దాల విషయానికి వస్తే నాలుగు మాంద్యాలు ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 1981 జూలై - 1982 మధ్యకాలంలో 15 మాసాలపాటు మాంద్యం కొనసాగింది. 1990 జూలై - 1991 మార్చిమధ్యలో 8 నెలలపాటు, 2001 మార్చి - నవంబర్ మధ్యకాలంలో 8 మాసాల పాటు, 2007 డిసెంబర్ - 2009 జూన్ మధ్యన 15 మాసాలపాటు మాంద్యాలు కొనసాగాయి. ఇందులో కొన్నిదేశాలు కొద్దిగా ముందూవెనుకా వచ్చి చేరాయి. ప్రస్తుత 2019 సంవత్సరపు పరిస్థితులు మాంద్యాన్నిసూచిస్తున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పతకస్థాయికి చేరడం, వెనిజులా, ఇరాన్ వంటి చమురు దేశాలు సంక్షోభంలో చిక్కుకోవడం, అమెరికా జీడీపీ రేటు పడిపోవడం వంటివి దీని లక్షణాలుగా చూపిస్తున్నారు. మాంద్యం ప్రభావాన్ని అంచనా వేయడం అప్పుడే సాధ్యపడకపోయినప్పటికీ ప్రపంచ వాణిజ్యంతో ముడివడి ఉన్న ఆర్థికవ్యవస్థలు కుదేలు కావడం ఖాయమనే మాటలు వినవస్తున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంతకూ ఆర్థికమాంద్యం అంటే ఏమిటి?"

Post a Comment