ప్రముఖ బ్యాంకు కీలక నిర్ణయం : డెబిట్ కార్డులకు గుడ్ బై

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డులకు గుడ్ బై చెప్పింది. ఇకపై డెబిట్ కార్డులు కనిపించవు అని తెలిపింది. వివరాల్లోకి వెళితే డెబిట్‌ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ క్రమంగా ప్లాస్టిక్‌ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్‌ పేమెంట్‌ విధానాలను ప్రోత్సహించాలని భావిస్తోంది.



 ఆ విధంగా డెబిట్‌ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం(ఆగస్టు 19,2019) బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు జరిగింది. ఇందులో ఎస్బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. డెబిట్ కార్డుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు

డెబిట్‌ కార్డులను పూర్తిగా తొలగించాలని భావిస్తున్నాం. కచ్చితంగా ఇది సాధ్యమేనని నమ్ముతున్నాం' అని ఆయన చెప్పారు. డెబిట్‌ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ 'యోనో' వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడతాయన్నారు. అసలు కార్డు అవసరమే లేకుండా యోనో ప్లాట్‌ఫాం ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చని, చెల్లింపులు కూడా జరపొచ్చని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్లకు పైగా డెబిట్‌ కార్డులు, 3 కోట్లకు పైగా క్రెడిట్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి. దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా ఖాతాదారులున్నారు.

ఎస్బీఐ ఖాతాదారుల్లో ఎక్కువమంది డెబిట్ కార్డులపై ఆధారపడి ఉన్నారు. యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని, కార్డు లేకుండా షాపుల్లో పేమెంట్స్ చేయొచ్చని రజనీష్ తెలిపారు. ప్రస్తుతం 68వేల యోనో కేంద్రాలు ఉన్నాయి. వాటి సంఖ్యను ఏడాదిన్నర కాలంలో 10లక్షలకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ కు యోనో యాప్ ద్వారా లోన్ కూడా పొందొచ్చని తెలిపారు. దాంతో ఇకపై క్రెడిట్ కార్డు అవసరం కూడా ఉండకపోవచ్చన్నారాయన. రాబోయే ఐదేళ్లలో దేశీయంగా డెబిట్ కార్డు అవసరం చాలా తక్కువ అవుతుందని, వర్చువల్ కూపన్లు కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పారు. కాగా, ప్రస్తుతం పేమెంట్స్ కోసం అనుసరస్తున్న క్యూఆర్ కోడ్ విధానం కూడా కాస్ట్లీనే అని రజనీష్ చెప్పారు.

డెబిట్ కార్డులు రద్దు చేయాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, మరికొందరు ఆమోదయోగ్యం కాదంటున్నారు. డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించడంలో తప్పు లేదు.. కానీ.. గ్రామీణులు, చదువు రాని వారి పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. గ్రామాల్లో చాలామంది డెబిట్ కార్డులే వాడతారు. మనీ విత్ డ్రా చేసుకోవాలన్నా, జమ చేయాలన్నా డెబిట్ కార్డు మీదే ఆధారపడతారు. రూరల్ ప్రాంతాల్లో కొంతమంది దగ్గర సెల్ ఫోన్లు కూడా లేవు. మరి అలాంటి వాళ్లు ఏం చేయాలి అనే సందేహం వ్యక్తమవుతోంది. చదువురాని వారికి యాప్ ల గురించి ఏం తెలుస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఎస్బీఐ అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రముఖ బ్యాంకు కీలక నిర్ణయం : డెబిట్ కార్డులకు గుడ్ బై"

Post a Comment