సర్కారీ బడులు.. చదువులమ్మ గుడులు
సర్కారీ బడులు.. చదువులమ్మ గుడులు
పురపాలక పాఠశాలల్లో వెలుస్తున్న ‘నో అడ్మిషన్ బోర్డులు’
3,650 మంది విద్యార్థులతో చంద్రంపాలెం స్కూలు ఘనత
ప్రవేశాల పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డు
అదే బాటలో రాష్ట్రవ్యాప్తంగా 36 విద్యాలయాలు
విజయవాడ నగరపాలిక పరిధిలో మొత్తం 106 పురపాలక పాఠశాలలు ఉండగా.. వీటిలో 29 ఉన్నత పాఠశాలలు. సత్యనారాయణపురంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం నగరపాలక సంస్థ పాఠశాల(ఏకేటీపీఎం)లో సీటు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. ఇందులో ప్రస్తుతం 1,707 మంది విద్యార్థులు చదువుతున్నారు. పటమటలోని గోవిందరాజులు ధర్మ ఈనామ్ ట్రస్ట్, మొగల్రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణ పాఠశాలలోనూ ప్రవేశాలు లభించని పరిస్థితి. దీంతో ‘నో అడ్మిషన్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అనేకమంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలతో వస్తున్నా సీటు ఇవ్వలేని పరిస్థితి
కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గి మూతపడుతుండగా మరికొన్ని బడుల్లో మాత్రం సీట్లు లేవంటూ బోర్డులు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకే డిమాండ్ పెరుగుతోంది. సీట్లు లేవని బోర్డులు పెట్టే వాటిలో అత్యధికం పురపాలక బడులే ఉండడం విశేషం. పురపాలకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలోఇలాంటివి 36 ఉన్నాయి.
వసతులు చాలకే సీట్లు లేవనే బోర్డులు
విద్యాహక్కు చట్ట ప్రకారం విద్యార్థులకు సీట్లు లేవని చెప్పరాదు. అందరికి ప్రవేశాలు కల్పించాల్సిందే.. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండడం.. సరిపడా తరగతి గదులు, ఉపాధ్యాయులు లేని పరిస్థితుల్లో ప్రవేశాలను నిలిపివేస్తున్నారు. కడప, విశాఖపట్నం, విజయవాడ, మదనపల్లె లాంటి చోట్ల సీట్ల కోసం ప్రజాప్రతినిధులతోనూ సిఫార్సులు చేయించుకుంటున్నారు.
విజయనగరం కస్పా బడి.. ఆరులో 284
విజయనగరం పురపాలక సంఘ పరిధిలోని కస్పా పాఠశాలలో ఈ ఏడాది మొత్తం 455 మంది చేరగా.. ఒక్క ఆరో తరగతిలోనే 284 ప్రవేశాలు పొందారు. ఇక్కడ మెరుగైన విద్య అందుతుండడంతో ప్రైవేటు స్కూళ్ల పిల్లలూ ఇందులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. 2017-18లో జాతీయ ప్రతిభ ఉపకార వేతనానికి 12 మంది ఎంపికయ్యారు. జాతీయ ప్రతిభ పరిశోధన(నేషనల్ టాలెంట్ సెర్చ్) పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో ఐదుగురు 10/10 గ్రేడ్‌పాయింట్లు సాధించారు. ఈ పాఠశాలలో మొత్తం 1447 మంది విద్యార్థులున్నారు. 70 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. తరగతి గదుల్లో ఫర్నిచర్ సదుపాయం, సువిశాల ఆటస్థలం, ప్రయోగశాల, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా రక్షిత నీటి సదుపాయం, డిజిటల్, వర్చువల్ తరగతుల నిర్వహణ, వృత్తివిద్య కోర్సులు ఈ పాఠశాలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి
సొంత పిల్లల్లా సంరక్షణ..
మదనపల్లెలోని వివేకానంద పాఠశాలలో మొత్తం 1,470 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది 450 మంది కొత్తగా చేరారు. ప్రవేశాల తాకిడి అధికంగా ఉండడంతో పక్కనే ఉన్న పాఠశాల స్థాయిని పెంచి, విద్యార్థులను అక్కడికి తరలించారు. ఫలితంగా ఈ బడిపై కొంత ఒత్తిడి తగ్గింది. మున్సిపల్ పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ఈ బడి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో 22 మంది 10/10 గ్రేడ్‌పాయింట్లు సాధించారు. ఈ పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు వరస కడుతున్నారు. ఇందులో సీటు కోసం ధర్నాలు చేసిన ఘటనలూ ఉన్నాయి.
* పాఠశాలలో చదివేవారిలో 90% మంది చేనేత కార్మికుల పిల్లలే.
* పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గురువులు రాత్రి పదింటి వరకు పాఠశాలలోనే ఉంటూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రాత్రివేళల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు పురపాలక అధికారుల సహకారంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
* గతేడాది ఇక్కడి నుంచి 12 మంది ట్రిపుల్‌ఐటీకి ఎంపికయ్యారు.
* పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకోవడంతో తల్లిదండ్రులు ధీమాగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. చాలమంది ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ఇదే పాఠశాలలో చేర్పిస్తున్నారు.
ఏంటీ ప్రత్యేకత.. ఎందుకీ మోజు..?
* నిపుణులైన ఉపాధ్యాయులు
* డిజిటల్ తరగతుల నిర్వహణ
* క్రమశిక్షణకు పెద్దపీట
* అత్యుత్తమ ఫలితాల సాధన
* పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ
* క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
* పరీక్షల సమయంలో అల్పాహారం ఏర్పాటు
* సమీపంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండటం
* ఫౌండేషన్ కోర్సులు, కెరీర్ గైడెన్స్, ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల్లో అదనపు మార్కులు లభించటం
* సువిశాల పాఠశాల ఆవరణలు
కడప అన్నమయ్య కూడలిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థులు 1,371.. ఒక్క తొమ్మిదో తరగతిలోనే ఏకంగా 326 మంది ఉన్నారు. ప్రవేశాల కోసం మరిందరు వస్తున్నా ఖాళీల్లేవంటూ బోర్డు పెట్టేశారు. కొత్తగా ఆరోతరగతిలో మాత్రమే 247 మందికి సీట్లిచ్చారు. నగర నడిబొడ్డున ఉండటం, ఎక్కడి నుంచైనా రవాణా సౌకర్యం, పురపాలక శాఖ పదోతరగతి విద్యార్థుల కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. నలభై మంది ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. సువిశాల పాఠశాల ఆవరణ, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం, అదనపు హంగులు, క్రీడల్లో రాణింపు ఈ బడికి ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.
10 రోజుల్లో 1,031.. 16 రోజుల్లో 1,100.. ఏంటీ అంకెలు అనుకుంటున్నారా? ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య.. విశాఖపట్నం చంద్రంపాలెంలోని ప్రభుత్వ పాఠశాల ఘనత. ఈ బడిలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఏకంగా 3,650కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా విద్యార్థులున్న పాఠశాల ఇదే కావటం విశేషం. గతేడాది ఈ పాఠశాలలో 802 మంది ప్రవేశాలు పొందగా.. 3,375 మంది ఉండేవారు. పదోతరగతి వరకు 42 సెక్షన్లు ఏర్పాటుచేశారు
పెరుగుతున్న ప్రవేశాల తాకిడి
కర్నూలు జిల్లా ఆదోనిలోని నెహ్రూ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1,700కి చేరింది. ఈ ఏడాది కొత్తగా 470 మంది చేరారు. విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో ‘నో అడ్మిషన్ బోర్డు’ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నారు. బడిలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, ఫౌండేషన్ కోర్సులు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి.
- ఈనాడు, అమరావతి, ఈనాడు, న్యూస్‌టుడే
0 Response to "సర్కారీ బడులు.. చదువులమ్మ గుడులు"
Post a Comment