ఇంటర్‌లో గ్రేడ్‌లు, మార్కులు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాల కోసం రెండూ ఇవ్వాలని నిర్ణయం గ్రేడింగ్ విధానం కొనసాగింపుపైనా చర్చ ఈనాడు - అమరావతి
ఇంటర్‌లో ఇక నుంచి గ్రేడ్‌లు, గ్రేడ్ పాయింట్లతోపాటు మార్కులు ఇవ్వనున్నారు. ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు గ్రేడింగ్ విధానంతో ఇబ్బందులు
ఎదురవుతున్నందున గ్రేడ్, గ్రేడ్‌పాయింట్లు, మార్కులను ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయం కళాశాలల్లో ప్రవేశాలకు వెళ్లిన విద్యార్థులకు గ్రేడ్లతో ఇబ్బందులు ఏర్పడినందున విద్యార్థుల అందరి మార్కులను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఇదే విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం అమలు చేయనున్నారు. ఇంటర్ ఫలితాల విడుదల సమయంలో గ్రేడ్‌లను ప్రకటిస్తారు.
అనంతరం మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే మొదటి ఏడాది విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చారు. ఇంటర్‌లో మార్కుల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2017-18 నుంచి గ్రేడ్‌ల విధానాన్ని తెచ్చింది. ఇంటర్ మొదటి ఏడాదిలో గ్రేడ్‌లు ఇచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. 2018-19లో రెండో ఏడాది విద్యార్థులకు గ్రేడ్‌లు,
గ్రేడ్‌పాయింట్లు ఇచ్చారు. ఈ గ్రేడ్‌లతో పక్క రాష్ట్రాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ, ఇతర ప్రవేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావడంతో మార్కులను అందుబాటులో ఉంచారు. గ్రేడ్‌లు మొదట ఇచ్చి ఆ తర్వాత మార్కులు ఇవ్వడం వల్ల కొంతవరకు విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
వెబ్‌సైట్‌లోని మార్కులను ఏ విద్యార్థికి ఆ విద్యార్థే చూసుకునే వీలుంటుందని, ఇతరుల మార్కులు తెలిసే అవకాశం ఉండబోదని పేర్కొంటున్నారు. అధికారికంగా గ్రేడ్‌లు ప్రకటించడం వల్ల కార్పొరేట్ కళాశాలల మధ్య పోటీతత్వం ఉండబోదని భావిస్తున్నారు. మార్కులు ఎవరికి అవసరమైతే వారే తీసుకుంటారని
వివరిస్తున్నారు. రాష్ట్రంలో చదువుకునే వారు గ్రేడ్‌పాయింట్లతోనే ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లోని మార్కులు విద్యార్థులకు మాత్రమే తెలిసే అవకాశం ఉన్నందున కొంత ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.
గ్రేడింగ్ విధానం ఉంచాలా? వద్దా?
ఒక పక్క గ్రేడింగ్ ఇచ్చి మరో పక్క మార్కులు ఇవ్వడంకంటే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా అధికారులు చర్చిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. గ్రేడింగ్ విధానంలో 91-100 మార్కులు వచ్చిన వారికి 10 గ్రేడ్‌పాయింట్లు ఇస్తున్నారు. పది మార్కుల వ్యత్యాసం ఉన్నా ఒకే గ్రేడ్ వస్తోంది. కళాశాలల్లో సీట్ల కేటాయింపులో ఇది సమస్యగా మారుతుండడంతో ఆయా విద్యాసంస్థలు మార్కులు కోరుతున్నాయి.
ఎంసెట్‌కు మార్కులే..
ఏపీ ఎంసెట్ సహా ఇతర ఏ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కావాలన్నా విద్యార్థులకు మార్కులు అవసరమవుతున్నాయి. ఇంటర్ మార్కులు కావాలంటూ ఈ ఏడాది విద్యామండలిని రోజుకు 500 నుంచి 600 మంది వరకు ప్రతి రోజు ఆశ్రయించారు. వచ్చిన వారికల్లా ఇచ్చుకుంటూ వెళ్లిన ఇంటర్ అధికారులు విద్యార్థులనుంచి ఒత్తిడి పెరగడం, మంత్రి ఆదేశాలతో చివరికి అందరి మార్కులను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఇస్తున్నారు. దీంతో ఎంసెట్‌కు మార్కులు అవసరమవుతున్నాయి. ఇవేకాకుండా చాలా మంది విద్యార్థులు తమిళనాడులోని డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలకు వెళ్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కర్ణాటకలో కేసెట్ రాస్తున్నారు. మరికొందరు తెలంగాణ ఎంసెట్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి వారందరికీ మార్కులు అవసరమవుతున్నాయి
0 Response to "ఇంటర్‌లో గ్రేడ్‌లు, మార్కులు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాల కోసం రెండూ ఇవ్వాలని నిర్ణయం గ్రేడింగ్ విధానం కొనసాగింపుపైనా చర్చ ఈనాడు - అమరావతి"
Post a Comment