ఏపీఎస్ ఆర్టీసీలో మోగిన స మ్మె సైరన్!

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ రోజు యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. 


అమరావతి: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు పరిష్కరించాలని ఆ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం అనంతరం కార్మిక సంఘాల ఐకాస నేత దామోదర్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేరని అధికారులు చెబుతున్నారని, యాజమాన్యం కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. గడువు కావాలని యాజమాన్యం కోరిందని.. అయితే ఇప్పటికే సమ్మె తేదీని ప్రకటించినందున ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు


సిబ్బందిని తగ్గించే చర్యలు మానుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరామని.. అదనపు సమయం పనిచేయబోమని కచ్చితంగా చెప్పామని తెలిపారు. తమ 26 డిమాండ్లలో కేవలం రెండు మాత్రమే ప్రభుత్వం పరిధిలోనివని, మిగతావన్నీ యాజమాన్యం పరిష్కరించాల్సి ఉన్నా.. చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఆరోపించారు. తాము చేపట్టనున్న సమ్మె.. యాజమాన్య వైఖరికి నిరసగానే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని దామోదర్‌ స్పష్టంచేశారు. 
ఆ నిధులను బడ్జెట్‌లో పెట్టి ఆదుకోవాలి 
తమ డిమాండ్లను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా పరిశీలించాలని దామోదర్‌ కోరారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ అనేక హామీలిచ్చారని.. తమ డిమాండ్లను ఆయన పరిశీలిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.3,700 కోట్లు ఇవ్వాలని.. ఆ నిధులను బడ్జెట్‌లో పెట్టాలన్నారు. సంస్థకు వచ్చిన నష్టాన్ని ఏటా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని దామోదర్‌ స్పష్టం చేశారు. జూన్‌ 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఇప్పటికే కార్మిక సంఘాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే

తమతమ న్యాయసమ్మతమైన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.

కార్మికుల వేతన సవరణ, బకాయిల చెల్లింపు, అద్దెబస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యల నిలుపుదల సహా 26 డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదని తెలిపారు. సమ్మె తేదీ గడువు పెంచాలన్న అధికారుల ప్రతిపాదనను జేఏసీ తిరస్కరించింది

ఈ నెల 13 నుంచి 53,500 మంది ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళతారు. ఈ నెల 9 నుంచి కార్మికులు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఇకపై డబుల్ డ్యూటీలు చేయరని సంఘాలు స్పష్టం చేశాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీఎస్ ఆర్టీసీలో మోగిన స మ్మె సైరన్!"

Post a Comment