ఏటీఎం లావాదేవీల ఛార్జీలూ మారనున్నాయ్‌

ముంబయి: వేరే బ్యాంకు ఏటీఎంలను వాడినందుకు గాను చెల్లించే ఛార్జీలు త్వరలో మారనున్నాయి. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ ఛార్జీలను సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఒక బ్యాంకు కార్డుతో వేరే బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రాన్ని వాడినందుకు గానూ చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది.



ఏ బ్యాంకు కార్డుదారులైనా వేరే బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు జరపొచ్చు. అయితే, వీటి సంఖ్యపై పరిమితి ఉంది. అంతకు మించిన సంఖ్యలో లావాదేవీలు జరిపినప్పుడు కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లావాదేవీలపై ఛార్జీల విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది

ఈ కమిటీకి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోషియేషన్‌ సీఈవో నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ఈ ఛార్జీలను నిర్ణయిస్తుంది. రానున్న రెండు నెలల్లో ఈ కమిటీ తన తొలి నివేదికను అందజేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.

ప్రస్తుతానికి ప్రముఖ బ్యాంక్‌ ఐసీఐసీఐ ఒక నెలలో ఆరు మెట్రో నగరాల్లో తొలి మూడు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో అయితే ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ప్రతి నగదు లావాదేవీకి రూ.20 ఛార్జి చేస్తోంది. నగదేతర (బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌) లావాదేవీకి రూ.8.50 ఛార్జీ వసూలు చేస్తోంది. ఎస్‌బీఐ ప్రతి నగదు లావాదేవీకి రూ.20+ జీఎస్టీ, నగదేతర లావాదేవీకి రూ.8+ జీఎస్టీని వసూలు చేస్తోంది. మరోవైపు నష్టాలకు ఆస్కారం లేకుండా ఛార్జీలను సవరించాలని ఏటీఎం ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్‌ సైతం డిమాండ్‌ చేస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏటీఎం లావాదేవీల ఛార్జీలూ మారనున్నాయ్‌"

Post a Comment