తదుపరి రాష్ట్రపతి ఎవరు?
వైసీపీపై పూర్తి భరోసా
2017లో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును జూన్ 17న ప్రకటించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత జూలై 17న ఎన్నికలు జరిగాయి. అదేనెల 20న ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు కూడా దాదాపు ఇవే తేదీల్లో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. కాగా, ఎన్డీఏతర పార్టీల విషయంలో వైసీపీ మద్దతుపై తమకు ఎలాంటి అనుమానాలూ లేవని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అనేక కీలక బిల్లులను పార్లమెంట్‌లో వైసీపీ సమర్థించిందని తెలిపారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతదళ్ కూడా ఎన్డీఏ అభ్యర్థిని సమర్థించే అవకాశాలున్నాయని, అయితే ఆపార్టీ విషయంలో పూర్తిగా నమ్మకం పెట్టుకోలేమని చెప్పారు. కాగా, 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 65.65ు ఓట్లు లభించాయి. అప్పట్లో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే, ఇప్పుడు 17 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉండడం, పెద్ద రాష్ట్రం యూపీలో సీట్ల సంఖ్య తగ్గిపోవడం, శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు ఎన్డీఏలో లేకపోవడం, టీఆర్‌ఎస్ వ్యతిరేకంగా మారడం వంటి కారణాల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి ఓట్ల శాతం తగ్గిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బీజేపీ లెక్క తగ్గింది!!
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి పనితీరు కనబరిచిన నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆ పార్టీ పెద్దగా ఆందోళన చెందనవసరం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే, ప్రత్యర్థులు పెరిగిపోయిన రీత్యా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా, బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం 5,37,126 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభిస్తాయని, అయినప్పటికీ 9,194 ఓట్లు తక్కువవుతాయని ఈ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం బీజేపీకి చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మోదీ, అమిత్ షాలు రంగంలోకి దిగితే.. ఎన్డీఏతర పార్టీలను కూడా చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సీనియర్ నేత, బీజేపీలో అందరికీ సన్నిహితుడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా పదోన్నతి కల్పించడం సహజంగా ఉంటుందని, అయితే, అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో పాటు వివిధ సమీకరణలు చూసుకోవల్సి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలి కాలంలో వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటిస్తుండడం గమనార్హం. కాగా, గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి.
ప్రతిపక్ష అభ్యర్థి ఎవరు?
రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎంపికను కష్టసాధ్యం చేయాలంటే ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసి ఒక బలమైన అభ్యర్థిని ఎంపిక చేయవలిసి ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ సారి ప్రతిపక్షాల శిబిరం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, శివసేన అధినేత ఉద్దావ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఈ విషయంపై కలిసి చర్చించవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్, దేవెగౌడ పేర్లు పరిగణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గిన ఎంపీ ఓటు విలువ
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన పార్లమెంటు సభ్యుల(ఎంపీ) ఓటు విలువ తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఒక్కొక్క ఓటు విలువ 708 ఉండగా.. ప్రస్తుతం ఇది 700లకు పడిపోయింది. దీనికి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ లేకపోవడమే కారణమని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది. ఎంపీ ఓటు విలువ.. రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు సహా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాసన సభ సభ్యులు ఉంటారు. జమ్ము కశ్మీర్ విభజనకు ముందు ఈ రాష్ట్రంలో 83 మంది శాసన సభ్యులు ఉండేవారు. అయితే, పునర్విభజన చట్టం మేరకు జమ్ము కశ్మీర్‌కు మాత్రమే శాసన సభ ఏర్పడగా, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. గత వారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన నివేదిక కేంద్రానికి అందింది. దీని ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 90కి చేరింది. ఎన్నికలు జరిగేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ఈ కారణంగానే ఎంపీ ఓటు విలువ 700లకు తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.
గుబులు రేపుతున్న కేసీఆర్
రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. దీంతో టీఆర్‌ఎ్‌సకు ఉన్న 82 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలు కూడా రాంనాథ్ కోవింద్‌కే జైకొట్టారు. ఇప్పుడు టీఆర్‌ఎ్‌సకి 103 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో ఈ పార్టీ వైఖరిపై బీజేపీలో గుబులు నెలకొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పాలిత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈసారి ఈ పార్టీ వైఖరిపైనా బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఆజాద్ కీలకమేనా!
మరోవైపు కశ్మీర్ సమస్యకున్న అంతర్జాతీయ ప్రాధాన్యత, ఆ రాష్ట్రంలో బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పేరు కూడా ప్రధాని మోదీ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరో ముస్లింనేత, కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అదేసమయంలో.. ఎస్సీ నేత అయిన కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు కూడా ఉపరాష్ట్రపతి విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి
0 Response to "తదుపరి రాష్ట్రపతి ఎవరు?"
Post a Comment